కొత్త బైకు కొనుగోలు చేస్తే.. రెండు హెల్మెట్లు కొనాల్సిందే..
తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి. రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్యను తగ్గించేందుకు రాష్ట్ర పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ పోలీస్ శాఖ సరికొత్త ప్రతిపాదనను ముందుకు తీసుకురానుంది.
కొత్త బైకు కొనుగోలు సమయంలో వాహనదారులు రెండు హెల్మెట్లు కొనుగోలు చేసేలా ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో బైక్ ప్రమాదాల మృతుల సంఖ్య తగ్గించవచ్చునని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
వాహనం నడిపేవారితో వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించేలా చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నిబంధన ఇప్పటికే అమలులో వుండగా, ప్రతి వాహనదారుడు బైకు కొనుగోలు చేసే సమయంలో రెండు హెల్మెట్ ధరించాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని భావిస్తున్నారు.