హేమంత్ కేసు.. ఇద్దరు అరెస్ట్.. బంగారు గొలుసు, ఉంగరం స్వాధీనం..
పరువు హత్యకు గురైన హేమంత్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్ అయ్యారు. సుపారీ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు కీలక విషయాలను మీడియాకు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన యుగంధర్, లక్ష్మారెడ్డి కస్టడీ నేటికి పూర్తి అయ్యింది. హేమంత్‌ను హత్యచేసేందుకు రూ.10 లక్షల సుపారీ మాట్లాడుకున్నారని ఈ కేసులో మొత్తం నలుగురిని అరెస్టు చేశామన్నారు. ఇప్పటి వరకు 14 మందిని రిమాండ్‌కు పంపించినట్లు తెలిపారు.
హేమంత్‌కు చెందిన ఐదున్నర తులాల బంగారం గొలుసు, ఉంగరాన్ని కృష్ణ నుండి రికవరీ చేశామని పోలీసులు వెల్లడించారు. ప్రేమ వ్యవహారాన్ని సహించని కారణంగానే సుపారీ మాట్లాడారని.. అవంతి సోదరుడు అనీష్ రెడ్డి ప్రమేయంతోనే ఎలాంటి ఆధారాలు లభించలేదని అన్నారు.
అలాగే హేమంత్ హత్య కేసులో నిందితుల ఆరు రోజుల కస్టడీ నేటితో ముగియనుంది. విచారణలో భాగంగా హేమంత్ కిడ్నాప్ నుంచి మర్డర్ వరకు సీన్ రీకన్‌స్ర్టక్షన్‌ను గచ్చిబౌలి పోలీసులు చేశారు. అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగంధర్ రెడ్డిల వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. అవంతి పేరిట ఉన్న ఆస్తులు మొత్తం రాసిచ్చినా ఎందుకు హత్య చేశారని ప్రశ్నించారు.
ప్రాణం కంటే పరువే ముఖ్యమని హేమంత్‌ను హత్య చేశామని లక్ష్మారెడ్డి విచారణలో చెప్పినట్లు సమాచారం. 15 ఏళ్లుగా యుగంధర్ రెడ్డితో మాటలు లేవని లక్ష్మారెడ్డి తెలిపాడు. అవంతి పెళ్లి వ్యవహారంతో యుగంధర్ రెడ్డితో మాట్లాడాల్సి వచ్చింది అని లక్ష్మారెడ్డి పేర్కొన్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా మరికొంత మందిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. సుపారీ గ్యాంగ్‌ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉంది.