ఫిబ్రవరి 14న ప్రేమ జంటలు కనబడితే ఆ పని చేస్తాం.. విహెచ్‌పి వార్నింగ్
వాలెంటైన్ డే అని ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమ జంటలు బయట తిరిగితే ఇక అంతే అంటూ భజరంగ్‌దళ్ నేతలు అంటున్నారు. వాలెంటైన్ డే సందర్భంగా ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించరాదని హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా పబ్‌లు, మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్‌లలో కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదని గట్టిగా చెప్తున్నారు.
ఈ మేరకు కోఠిలోని విహెచ్‌పీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైన భజరంగ్‌దళ్ కన్వీనర్ సుభాష్ చందర్, నాయకులు శివరాములు, ముఖేశ్, జగదీశ్వర్, కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రేమ జంటలు ఎక్కడైనా బహిరంగంగా కనిపిస్తే వారిని పట్టుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇప్పిస్తామన్నారు.
ఇంకా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించే పబ్‌లు, రెస్టారెంట్‌లు మొదలైన వాటిపై దాడులు పాల్పడేందుకు కూడా వెనకాడబోమని స్పష్టం చేసారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్ డేకు నిరసనగా రాష్ట్రంలోని ప్రధాన కూడళ్లలో వాలెంటైన్ దిష్టి బొమ్మ దహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కన్వీనర్ సుభాష్ చందర్ తెలిపారు. అలాగే నల్లజెండాలతో నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.