ఇకపై ప్రభాస్ సినిమాలన్నీ రెండు భాగాలేనా!
ప్రభాస్ సినిమాలు ఇకపై రెండు భాగాలుగా వుండాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాలుగా ఆయన నటించే సినిమాలు వుండబోతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలు అలా మార్చాలని ప్రభాస్ కూడా అనుకున్నట్లు తెలుస్తోంది. అందుకే `సలార్` సినిమాను రెండు భాగాలుగా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర యూనిట్ నుంచి సమాచారం బయటకు పొక్కింది. ఎందుకంటే ప్రభాస్ రేంజ్ పెరగడంతోపాటు ఆయన పారితోషికాన్ని కూడా పెంచడం నిర్మాతలు వందల కోట్ల వరకు ఇవ్వడం ఖరారైంది. కనుక ఇకపై కథ డిమాండ్ మేరకు ప్రభాస్ సినిమాలను రెండు భాగాలుగా చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కన్నడ సినిమా కె.జి.ఎఫ్. కూడా రెండు భాగాలుగా విడుదలవుతోంది.మొదటి భాగం చాలా మందికి నచ్చకపోయినా మార్కెటింగ్ పరంగా బాగా వసూలు చేసింది. అందుకే రెండో భాగం కూడా తీశారు. అది కూడా విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు అదే పనిలో అల్లు అర్జున్ `పుష్ప` కూడా రెండో భాగంగా రాబోతుంది. అదేవిధంగా ప్రభాస్ నటిస్తున్న సలార్ తోపాటు `ఆదిపురుష్` సినిమాను కూడా రెండు భాగాలు తీయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
పౌరాణిక కథ కాబట్టి రెండు, మూడు గంటల్లో చెప్పేదికాదు. దానికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయాలంటే రెండు భాగాలు తీయాలని దర్శకుడు ఓం రౌత్ నుంచి వచ్చిన ఆలోచన అట. మేకర్స్ కూడా పాన్ ఇండియా సినిమా కాబట్టి మార్కెటింగ్‌లో డిజిటల్ మీడియా తోడవడంతో పలు రకాలుగా సినిమా పెట్టుబడి నుంచి రాబట్టుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.