బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2024 (17:58 IST)

బాల్యం నుంచే దేశభక్తి ని అలవరుసుకునేలా అభినవ్ చిత్రం - భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్

balaji and abhinav team
balaji and abhinav team
"ఆదిత్య", "విక్కీస్ డ్రీమ్", "డాక్టర్ గౌతమ్" వంటి సందేశాత్మక బాలల చిత్రాలతో పసి మనసుల్లో మంచి నాటే ప్రయత్నం చేసి ఎంతోమంది పిల్లల, తల్లిదండ్రుల ప్రశంసలతో పాటు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు దర్శక నిర్మాత భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్. ఆయన శ్రీ‌ల‌క్ష్మి ఎడ్యుకేష‌న‌ల్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ స‌మ‌ర్ప‌ణ‌లో సంతోష్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న మరో బాలల లఘు చిత్రం "అభినవ్ "(chased padmavyuha). ఈ చిత్రంలో స‌మ్మెట గాంధీ, స‌త్య ఎర్ర‌, మాస్ట‌ర్ గ‌గ‌న్‌, గీతా గోవింద్‌, అభిన‌వ్‌, చ‌ర‌ణ్, బేబీ అక్ష‌ర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా పాత్రికేయ సమావేశాన్ని తాజాగా హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ, పిల్లల్లో చిన్నప్పటి నుంచే దేశభక్తిని రూపొందించాలనే లక్ష్యంతో ఈ సినిమాను రూపొందించాను. విదేశాల్లో పిల్లలకు చిన్నప్పటి నుంచే దేశ రక్షణ విషయంలో అవగాహన కల్పించి, శిక్షణ ఇస్తుంటారు. అలా మన పిల్లలను కూడా తీర్చిదిద్దాలి. దురదృష్టవశాత్తూ పిల్లలు గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. డ్రగ్ మాఫియా మన గ్రామీణ ప్రాంతాల్లోనూ బాగా విస్తరించింది. ఎన్ సీసీ, స్కౌట్స్, యోగ, ధ్యానం నేర్చుకోవడం ద్వారానే పిల్లలు ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండగలరు. దేశ రక్షణలో భాగం కాగలరు. ఇలాంటి స్ఫూర్తికరమైన అంశాలతో బాలలను గొప్ప మార్గంలో పయనించేలా ఉత్తేజపరుస్తూ "అభినవ్ "(chased padmavyuha) చిత్రాన్ని రూపొందించాం. ఈ చిత్రాన్ని అన్ని ఫిలిం ఫెస్టివల్స్ కు పంపించాం. అలాగే నేషనల్ అవార్డ్స్ కు  పంపిస్తున్నాం అన్నారు.
 
నటుడు బాలాజీ మాట్లాడుతూ - సుధాకర్ గౌడ్ "అభినవ్ "(chased padmavyuha) సినిమా తనకోసం రూపొందించలేదు. పిల్లల కోసం రూపొందించారు. చెడు ఏ రూపంలో ఉన్నా అది కీడు చేస్తుందని పిల్లలకు చెప్పాలి. చిన్నప్పుడు అన్నం తినకుంటే బూచి వస్తుందని చెప్పేవాళ్లం. అలాగే డ్రగ్స్ కానీ ఇతర ఏ మత్తుపదార్థాలైనా జీవితాలను పాడుచేస్తాయని ఈ చిత్రం ద్వారా పిల్లలకు చెప్పే మంచి ప్రయత్నం చేసిన సుధాకౌర్ గౌడ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నా అన్నారు.
 
సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీపూజ మాట్లాడుతూ - నేను తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో తరుపున సెమినార్స్, వర్క్స్ చేస్తుంటాము. సుధాకర్ గౌడ్ గారిని నేను చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ టైమ్ లో ఐమ్యాక్స్ లో కలిశాను. ఆయన సినిమాల గురించి తెలిశాక మీరు డ్రగ్స్ ఎఫెక్ట్ గురించి మూవీ చేయొచ్చు కదా అని అడిగాను. ఆయన "అభినవ్ "(chased padmavyuha) సినిమా ఆ కాన్సెప్ట్ తోనే చేస్తున్నామని చెప్పారు. ఇలాంటి మంచి మూవీ చేసి ఎంతోమంది పిల్లల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్న సుధాకర్ గౌడ్ గారికి నా అభినందనలు అన్నారు.