శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (15:41 IST)

నిర్మాత‌గా మారిన 'చిన్నారి పెళ్లికూతురు` అవికా గోర్‌

Avika gor, Roshan
'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో బుల్లితెర వీక్షకులను... 'ఉయ్యాలా జంపాలా', 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి విజయవంతమైన సినిమాల్లో కథానాయిక నటించిన అవికా గోర్ తెలుగు ప్రజలను ఆకట్టుకున్నారు. అవికా స్క్రీన్ క్రియేషన్స్  పేరుతో ఆమె ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించారు. అలాగే ఆచార్య క్రియేషన్స్ బేన‌ర్‌పై 'నెపోలియన్` చిత్రానికి అందించిన భోగేంద్ర గుప్తా మడుపల్లి క‌లిసి నిర్మిస్తున్నారు. 
 
ఇంకా పేరు నిర్ణ‌యించ‌ని ఈ సినిమాలో అవికా గోర్ హీరోయిన్. సాయి రోనక్ హీరో. ఈ చిత్రానికి ఎం.ఎస్. చలపతి రాజు సహ నిర్మాత. ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వం వహించనున్నారు. అలాగే, అవికా గోర్ తో పలు యాడ్స్ చేశారు. ఆచార్య క్రియేషన్స్ లో తాను దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కథానాయికగా నటించమని ఆమె దగ్గరకు వెళ్లడం, ఆ కథ నచ్చడంతో నిర్మాతగా మారాలని అవికా నిర్ణయించుకోవడం వెంట వెంటనే జరిగాయి.
 
ఈ సందర్భంగా అవికా గోర్ మాట్లాడుతూ "నా చిన్నతనం నుంచి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఇక్కడ ప్రతి అంశాన్ని నిశితంగా గమనించా. అందుకని, ప్రొడక్షన్ లోకి రావాలని అనుకుంటున్నాను. ఆచార్య క్రియేషన్స్ కోసం రాసిన కథను మురళీ నాగ శ్రీనివాస్ గంధం నాకు చెప్పారు. దర్శకుడు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. నిర్మాతగా నా  తొలి సినిమాకు ఇదే సరైన కథ అనుకున్నాను. దాంతో నేనూ ప్రొడక్షన్ లో పార్ట్ అవుతానని చెప్పా. ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బంధం ఈ సినిమాతో మరింత బలపడుతుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.
 
దర్శకుడు మురళీ నాగ శ్రీనివాస్ గంధం మాట్లాడుతూ "మెలోడ్రామా జానర్ లో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఒకరిపై మరొకరికి విపరీతమైన ద్వేషం ఉన్న ఓ అమ్మాయి, ఓ అబ్బాయి తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితిలో చిక్కుకుంటారు. ఆ తర్వాత ఏమైందనేది కథ" అని అన్నారు.
నిర్మాత భోగేంద్ర గుప్తా మడుపల్లి మాట్లాడుతూ "సరికొత్త కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. అవికా గోర్ నిర్మాణ భాగస్వామ్యంలో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించనున్నారు. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తాం" అని అన్నారు.