ఆస్కార్ నటులు - కమల్ హాసన్‌లు ఎక్కువైపోయారు.. వీళ్ళ నటన చూడలేకపోతున్నాం : బండ్ల గణేశ్ ట్వీట్
టాలీవుడ్ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ అయింది. ఆస్కార్ నటులు, కమల్ హాసన్‌లు ఎక్కువైపోతున్నారు. వీళ్ల నటన చూడలేకపోతున్నాం అంటూ చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే, ఆయన ఎవరిని ఉద్దేశించి చేశారనేదానిపై స్పష్టత లేనప్పటికీ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రెస్మీట్ జరుగుతున్న సమయంలో ఈ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. బండ్ల గణేష్ వ్యాఖ్యలు దిల్ రాజును ఉద్దేశించే కావొచ్చని పలువురు సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల యజమాన్య సమస్యలు, బంద్ ప్రకటనల నేపథ్యంలో నెలకొన్న గందరగోళంపై ప్రముఖ నిర్మాతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తమపై వస్తున్న ఆరోపణలకు స్వయంగా మీడియా ముందుకు వచ్చిన వివరణ ఇచ్చుకుంటున్నారు. ఆదివారం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తొలుత మీడియా ముందుకు వచ్చిన ఆ నలుగురంటూ సాగుతున్న ప్రచారంలో తాను లేనని, ఆ నలుగురు గ్రూపు నుంచి తాను ఎపుడో బయటకు వచ్చేశానని తన వద్ద కేవలం పది లేదా 15 థియేటర్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు.
ఇంతలోనే మరో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోమవారం మీడియా ముందుకు వచ్చారు. తెలంగాణాలో తనకు కేవలం 30 థియేటర్లు మాత్రమే ఉన్నాయని, మొత్తం 370 థియేటర్లలో ఏషియన్ సునీల్, దిల్ రాజు వర్గంలో ఆధీనంలో కేవలం 120 థియేటర్లు మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చారు. పైగా పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్మూధైర్యం ఎవరికైనా ఉందా అంటూ దిల్ రాజు వ్యాఖ్యానించారు. ఆ సమయంలోనే బండ్ల గణేష్ ట్వీట్ చేయడం గమనార్హం.