ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి : చిరంజీవి
స్వర్గీయ ఎన్.టి.రామారావు జయంతిని పురస్కరించుకుని ఆయనను మెగాస్టార్ చిరంజీవి గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరారు. ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు.
ముఖ్యంగా, ప్రముఖ గాయకుడు, నవయుగ వైతాళికులు భూపేన్ హజారికాకు మరణానంతరం భారతరత్న ఇచ్చినట్లు మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావుకి భారతరత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు.
శత జయంతి దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్‌కి ఈ గౌరవం దక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవం అని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఆ మహానుభావుడి 98వ జన్మదిన సందర్భంగా స్మరించుకుంటున్నానని చెప్పారు.
ఎన్టీఆర్ 98వ జయంతిని పురస్కరించుకుని ఈ ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్‌పై ఎంతోమంది పుస్తకాలు రాశారని గుర్తు చేసిన బాలకృష్ణ.. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఎప్పటి నుంచో కోరుతున్నట్టు చెప్పారు. ఇదే విషయాన్ని మరోమారు డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు.
ఎన్టీఆర్ యుగపురుషుడని, పేదల పెన్నిధి అని బాలకృష్ణ కొనియాడారు. తన తండ్రి సినిమాలు చూసి తాను స్ఫూర్తి పొందానని చెప్పారు. కాగా, కరోనా కారణంగా ఈసారి ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించలేకపోతున్నానని ఆయన మరో తనయుడు రామకృష్ణ తెలిపారు. అభిమానుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అందరూ విధిగా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు.