శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (17:27 IST)

గుండు హనుమంతరావు మృతి తీరని లోటు : చిరంజీవి

ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు మృతిపై చిరంజీవి విచారాన్ని వ్యక్తం చేశారు. "తెలుగు చిత్రసీమలో ప్రతి హాస్యనటుడిదీ ఒక్కో శైలి. అలానే గుండు హనుమంతరావుగారు సైతం తనదైన శైలితో కోట్లాది తెలుగు ప్రేక్షకులకు మూడు దశాబ్దాలుగా వినోదాన్ని అందిస్తూ వచ్చారు. ఆ

ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు మృతిపై చిరంజీవి విచారాన్ని వ్యక్తం చేశారు. "తెలుగు చిత్రసీమలో ప్రతి హాస్యనటుడిదీ ఒక్కో శైలి. అలానే గుండు హనుమంతరావుగారు సైతం తనదైన శైలితో కోట్లాది తెలుగు ప్రేక్షకులకు మూడు దశాబ్దాలుగా వినోదాన్ని అందిస్తూ వచ్చారు. ఆ మధ్య ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలిసి కలత చెందాను. నా వంతు సాయం అందించాను. 
 
పరిపూర్ణ ఆరోగ్యంతో ఆయన తిరిగి సినిమాల్లో నటిస్తారని భావించాను. కానీ ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది. గుండు హనుమంతరావు గారి మృతితో తెలుగు సినిమా రంగం మంచి నటుడినే కాదు, చక్కని మనిషినీ కోల్పోయింది. ఆయన ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను'' - చిరంజీవి
 
గుండు హనుమంతరావు ఆత్మకి శాంతి కలగాలి- డా.మోహన్ బాబు 
మా నిర్మాణ సంస్థ "లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్"లో చాలా సినిమాల్లో నటించారు గుండు హనుమంతరావు. మంచి నటుడు మాత్రమే కాదు మంచి వ్యక్తి ఆయన. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల సమర్ధుడు. అలాంటి వ్యక్తి నేడు మనల్ని భౌతికంగా విడిచి వెళ్లడం బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోనిబ్బరం ప్రసాదించాలని ఆ షిరిడి సాయినాధుని వేడుకొంటున్నాను.
 
చిత్ర పరిశ్రమ మంచి నటుడ్ని కోల్పోయింది - నందమూరి బాలకృష్ణ
ఆరోగ్యకరమైన హాస్యాన్ని యావత్ తెలుగు ప్రేక్షకులకు పంచిన గుండు హనుమంతరావు గారి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయనతో కొన్ని సినిమాల్లో కలిసి నటించాను. మృదు స్వభావి. ఆయన ఆత్మకు శాంతి చేకూరి, ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకొంటున్నాను.