సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించిన హరనాథ్ జీవిత చరిత్ర అందాల నటుడు
Haranath family with krishna
బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న తెలుగు హీరో బుద్ధరాజు హరనాథ్ రాజు 1936లో సెప్టెంబర్ 2న తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని రాపర్తి గ్రామంలో జన్మించారు. చెన్నైలో పాఠశాల విద్యను అభ్యసించిన ఆయన కాకినాడలోని పి.ఆర్ కళాశాలలో B.A డిగ్రీని పూర్తి చేశారు. ఆయన తన కెరీర్‌లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో కలిపి 167 సినిమాల్లో నటించారు. హరనాథ్ 1989, నవంబర్ 1న మరణించారు.
హరనాథ్ జీవిత చరిత్రను 'అందాల నటుడు' పేరుతో ఆయన వీరాభిమాని, ఆరాధకుడు డాక్టర్ కంపల్లి రవిచంద్రన్ రచించారు. అరుదైన ఫోటోలు, ఎవరికీ అంతగా తెలియని ఆసక్తికరమైన విషయాలతో ఈ పుస్తకాన్ని అందంగా తీర్చిదిద్దారు. డాక్టర్ కంపల్లి రవిచంద్రన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు ఇతర సంస్థల నుండి అనేక అవార్డులు అందుకున్నారు.
దివంగత హీరో హరనాథ్ జీవిత చరిత్ర 'అందాల నటుడు'ని ఆయన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఉదయం 10 గంటలకు హరనాథ్ కుమార్తె జి.పద్మజ, అల్లుడు జివిజి రాజు (చిత్ర నిర్మాత-'తొలి ప్రేమ' , 'గోదావరి' ) మరియు మనవలు శ్రీనాథ్ రాజు మరియు శ్రీరామ్ రాజు సమక్షంలో నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ ఆయన నివాసంలో విడుదల చేశారు.
హరనాథ్ కుమారుడు బి. శ్రీనివాస్ రాజు (చిత్ర నిర్మాత- 'గోకులంలో సీత' , 'రాఘవేంద్ర'), కోడలు మాధురి, మనవరాళ్లు శ్రీలేఖ, శ్రీహరి చెన్నైలో నివాసం ఉంటున్నారు.
పుస్తక విడుదల సందర్భంగా సూపర్‌స్టార్ కృష్ణ గారు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తాను, హరనాథ్ కలిసి పలు సినిమాల్లో నటించామని అన్నారు. అతను నిజమైన అందాల నటుడని, అలాగే మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. అంతేకాకుండా తాను హీరోగా హరినాథ్ 'మా ఇంటి దేవత' అనే చిత్రాన్ని కూడా నిర్మించారని గుర్తుచేసుకున్నారు.
స్వర్గీయ నటరత్న ఎన్.టి.రామారావు దర్శకత్వం వహించిన 'సీతారామ కళ్యాణం' చిత్రంలోని 'శ్రీ సీతారాముల కళ్యాణము చూడము రారండి' పాటలో శ్రీరామునిగా ఆయన రూపం తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.