విజయశాంతి మేకప్ మేన్ ఎ.ఎం.రత్నం నిర్మాతగా ఎలా మారాడు!
సినిమారంగంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలీదు. ఎవరు ఏ రంగంలో స్థిరపడతారో చిత్రమే. బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అవుతాయి. లైట్ మేన్ గా పనిచేసినవాడో దర్శకుడుగా మారిన సంఘటనలు వున్నాయి. కోట్లు పెట్టి సినిమాలు తీసినవారు ఆ తర్వాత కనుమరుగయిన సందర్భాలున్నాయి. ఇన్ని చిత్ర విచిత్రాలు కొందరి జీవితాల్లోనూ జరుగుతాయి. ఆ వ్యక్తి ఎ.ఎం.రత్నం. ఆయన పుట్టినరోజు నేడే. ఆయన మొదట మేకప్ మెన్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత నిర్మాతగా, దర్శకుడిగా ఎదిగారు. మధ్యలో కొంతకాలం నష్టాల్లో వుండగా నిర్మాతగా వెనకడుగువేశాడు.
విజయశాంతి ప్రోత్సాహం
మేకప్ మేన్‌గా ఆర్టిస్టులకు నైపుణ్యాన్ని ప్రదర్శించేవాడు. ఆయన పూర్తి పేరు అరణి మునిరత్నం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలో 1956 ఫిబ్రవరి 4న జన్మించారాయన. చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఎంతో అభిమానం. ఈ రంగంలోకి రావాలని కాంక్షతో మేకప్‌మేన్‌గా పనిచేశారు. అప్పట్లో విజయశాంతి ఓ సినిమాకు పనిచేయడంతో ఆయన ఆమెకు మేకప్ వేయాల్సివచ్చింది. క్రమేణా విజయశాంతి పర్సనల్ మేకప్ మేన్ గా మారిపోయారు. దానితోపాటు ఆమె కాల్ షీట్స్ కూడా చూసే స్థాయికి ఎదిగాడు. అదే ఆయకు వరంగా మారింది. ఎ.ఎం.రత్నంలో నిజాయితీ ఆమెకు నచ్చి అతన్ని ప్రోత్సహించింది. కాలక్రమేణా విజయశాంతి ప్రోత్సాహంతో శ్రీసూర్యా మూవీస్ అనే బ్యానర్ నెలకొల్పారు రత్నం.
సక్సెస్ చిత్రాలు
తొలి ప్రయత్నంగా విజయశాంతి ప్రధాన పాత్రలో కర్తవ్యం నిర్మించారు. ఆ సినిమా సంచలన విజయం సాధించింది. విజయశాంతికి జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా అవార్డు సంపాదించి పెట్టింది. తరువాత స్వీయ దర్శకత్వంలో పెద్దరికం అనే సినిమాను నిర్మించి, తెరకెక్కించారు. ఆ సినిమా జగపతి బాబుకు నటునిగా మంచి పేరు తెచ్చింది. జగపతిబాబుతో రత్నం దర్శకునిగా రూపొందిన సంకల్పం అంతగా అలరించలేక పోయింది. ఈ సినిమాతోనే ప్రకాశ్ రాజ్ తొలిసారి తెలుగులో నటించారు. రత్నం అనువాద చిత్రాలతోనూ తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్నారు. జెంటిల్ మేన్, ప్రేమికుడు, ప్రేమలేఖవంటి చిత్రాలూ జనాన్ని కట్టి పడేశాయి. తరువాత శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ తో రత్నం నిర్మించిన ఇండియన్ తెలుగులో భారతీయుడుగా వచ్చింది.ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో అనూహ్య విజయం సాధించింది.
కొద్దికాలం ఇబ్బందులు పడ్డారు
చిరంజీవితో స్నేహం కోసం, పవన్ కళ్యాణ్ తో ఖుషి, బంగారం, జూనియర్ యన్టీఆర్ తో నాగ తీశారు. అలాంటి ఆయన కెరీర్‌లోనూ అవరోధాలు లేకపోలేదు. పెద్దబ్బాయి జ్యోతికృష్ణ నీ మనసు నాకు తెలుసుతో దర్శకునిగా పరిచయం అయ్యారు. రెండో అబ్బాయి రవికృష్ణ 7 జి బృందావన్ కాలనీతో నటునిగా మారారు. కానీ ఆ తర్వాత తన కుమారులుతో తీసిన సినిమాలు డిజాస్టర్ కావడంతో ఆర్థికంగా చాలా నష్టపోయారు. పైగా పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా తలపెట్టి ఆర్భాటంగా అప్పట్లో దాసరినారాయణరావు, రామానాయుడు వంటి ఉద్దంఢులతో ఆరంభించారు. కానీ ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్‌తో పెండ్లికాక ముందు ఓభారీ సినిమాను ప్లాన్ చేశారు. అది కూడా కొండెక్కింది. ఇలా అడ్డంకులను ఎదురొడ్డి ఫైనల్‌గా మరలా పవన్ కళ్యాన్ తో సినిమా చేస్తున్ఆరు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రం నిర్మిస్తున్నారాయన.