Widgets Magazine

సాయిధరమ్ తేజ్ 'ఇంటెలిజెంట్' ఔనా? కాదా? (రివ్యూ రిపోర్ట్)

మెగా ఫ్యామిలీ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న కథానాయకుడు సాయి ధరమ్ తేజ్. ఈ యువ హీరో కెరీర్ ఆరంభంలో 'పిల్లానువ్వులేని జీవితం', 'సుబ్ర‌మ‌

Inttelligent  movie still
pnr| Last Updated: శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (14:45 IST)
చిత్రం : ఇంటెలిజెంట్
నిర్మాణ సంస్థ: సి.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్
నటీనటులు : సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే తదితరులు.
కథ, మాటలు: శివ ఆకుల
సంగీతం: థమన్‌
సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా
నిర్మాత: సి.కళ్యాణ్‌
క‌థ‌నం, దర్శకత్వం: వి.వి.వినాయక్‌

మెగా ఫ్యామిలీ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న కథానాయకుడు సాయి ధరమ్ తేజ్. ఈ యువ హీరో కెరీర్ ఆరంభంలో 'పిల్లానువ్వులేని జీవితం', 'సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్', 'సుప్రీమ్' వంటి వ‌రుస విజ‌యాల‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత సాయి నటించిన నాలుగు చిత్రాలు వరుస ఫ్లాప్‌లనే చవిచూశాయి. ఇలాంటి త‌రుణంలో క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరున్న వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌ర‌మ్ సినిమా చేయ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. చిరంజీవి క‌మ్ బ్యాక్ సినిమా "ఖైదీ నంబర్ 150"కు దర్శకత్వం వహించిన వినాయ‌క్ ఇపుడు.. సాయిధ‌ర‌మ్‌ను తెర‌పై ఎలా ఆవిష్క‌రించాడో తెలుసుకుందాం.

క‌థ‌:
విజ‌న్ సాఫ్ట్‌వేర్ సొల్యూష‌న్స్ అధినేత నంద‌కిషోర్ (నాజ‌ర్‌) అనాథ‌ల‌కు, నిరుపేదలకు స‌హాయ‌ప‌డుతుంటాడు. త‌న కంపెనీలో ప‌నిచేసే ఉద్యోగుల‌ను తన కుటుంబ సభ్యుల్లా చూసుకుంటుంటాడు. నంద‌కిషోర్ స‌హాయంతో చ‌దువుకుని... ఆయన కంపెనీలోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరుతాడు తేజ (సాయిధ‌ర‌మ్ తేజ్‌). త‌న స్నేహితులు (రాహుల్ రామ‌కృష్ణ‌, స‌ప్త‌గిరి, న‌ల్ల‌వేణు)ల‌తో క‌లిసి, న‌చ్చిన ఉద్యోగం చేస్తుంటాడు. అతని జీవితంలోకి ఓ అమ్మాయి (లావ‌ణ్య త్రిపాఠి) ప్రవేశిస్తుంది. ముందు తేజ అంటే ఇష్ట‌ప‌డ‌క‌పోయినా.. అమ్మాయిలంటే అత‌నికున్న గౌర‌వాన్ని చూసి అత‌నిపై మనసు పారేసుకుంటుంది.

అదేస‌మ‌యంలో నంద‌కిషోర్ త‌న కంపెనీ ఉద్యోగుల‌కు చేస్తున్న బెనిఫిట్స్ చూసి.. నంద‌కిషోర్‌ను దెబ్బ కొట్టి.. కంపెనీని సొంతం చేసుకోవాల‌నుకుంటారు ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం. అందులో భాగంగా మాఫియా డాన్ విక్కీ భాయ్‌(రాహుల్ దేవ్‌), అత‌ని త‌మ్ముడు (దేవ్ గిల్‌)ల స‌హాయం తీసుకుంటారు. విక్కీ అండ్ గ్యాంగ్ నంద‌కిషోర్‌ను బెదిరించినా లొంగ‌డు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని క‌ల‌వాల‌నుకుంటాడు. అయితే అనుకోకుండా త‌న కంపెనీ విజ‌న్ సాఫ్ట్‌వేర్ సొల్యూష‌న్స్‌ను విక్కీకి రాసేసి ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు నంద‌కిషోర్‌. ఆసమయంలో తేజ‌పై దాడి కూడా జరుగుతుంది. ఉన్నట్టుండి నందకిషోర్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? అస‌లు అది ఆత్మ‌హ‌త్యా? హ‌త్యా? చివ‌ర‌కు త‌న‌కు అండ‌గా నిల‌బ‌డిన నంద‌కిషోర్ అండ్ ఫ్యామిలీ కోసం తేజ ఎలాంటి సాహసం చేస్తాడు? అనేది పూర్తి కథ.

విశ్లేష‌ణ‌:
చిత్రంలో నటీనటుల తీరుతెన్నుల గురించి పరిశీలిస్తే, సాయిధ‌ర‌మ్ తేజ్ త‌న‌దైన ఎన‌ర్జిటిక్ డాన్సులు, యాక్ష‌న్ పార్ట్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. ఇక హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లామ‌ర్ కోసం లావ‌ణ్య‌ను తీసుకున్నార‌నిపించిందంతే. లావ‌ణ్య పాత్ర పాట‌ల‌కే ప‌రిమిత‌మైంది. నాజన తన పాత్రకు న్యాయం చేశారు. ఇక క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో వచ్చే సన్నివేశాలు సరేసరే. కాశీ విశ్వ‌నాథ్‌, బ్ర‌హ్మానందం, షాయాజీ షిండే త‌దిరులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

ఇక ఫ‌స్టాఫ్ విష‌యానికి వ‌స్తే.. హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ఎలివేష‌న్‌.. హీరో, అత‌ని స్నేహితులు, పోసాని కృష్ణ‌ముర‌ళి మ‌ధ్య వ‌చ్చే కామెడీ ట్రాక్‌... జ‌య‌ప్రకాష్, తేజు, స‌ప్త‌గిరి, విద్యుల్లేఖా రామ‌న్‌, ఫిష్ వెంక‌ట్‌, పోసాని మ‌ధ్య వ‌చ్చే ఎంట‌ర్‌టైనింగ్ పార్టుల‌తో సాగిపోయింది. ఇక సెకండాఫ్ విష‌యానికి వ‌స్తే థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ, కాదంబ‌రి కిర‌ణ్‌కుమార్ కామెడీ ట్రాక్‌తో కాస్త నవ్వించే ప్ర‌య‌త్నం చేశారు.
ఇకపోతే.. చిత్రం ద్వితీయార్ధంలో హీరో త‌న చేసే ప‌నిలో భాగంగా క్రియేట్ చేసే ధ‌ర్మాభాయ్‌.. పాత్ర, దాని తీరు తెన్నులు నాయ‌క్ సినిమాకు ద‌గ్గ‌ర‌గా ఉంటాయి. ఆకుల శివ అందించిన క‌థ‌లో ఎక్కడా కొత్త‌ద‌నం కనిపించదు. ఇక త‌మ‌న్ ట్యూన్స్ వినసొంపుగా లేవనే చెప్పొచ్చు. నేప‌థ్య సంగీతం ఫర్వాలేదు. విశ్వేశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. ప్రతి సీన్ ఎంతో రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. మొత్తంమీద చిత్రం మాత్రం పెద్దగా ఆకట్టుకునేలా లేదనే చెప్పొచ్చు.


దీనిపై మరింత చదవండి :