బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2020 (08:44 IST)

"సర్ అంటున్నారు.. ఇదెప్పటినుంచి..." : పవన్‌కు కేటీఆర్ ట్వీట్

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. దీనికి ట్విట్టర్ వేదికైంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో రాష్ట్ర ప్రజలంతా తమతమ ఇళ్ళకే పరిమితం కావాలంటూ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. అదేసమయంలో ప్రజాప్రతినిధులు తమతమ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. 
 
సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. పలు ప్రాంతాలను సందర్శిస్తూ అక్కడ ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. అనేక సమస్యలను తక్షణం పరిష్కరిస్తున్నారు. దీంతో కేటీఆర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో కేటీఆర్‌ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు. 
 
"కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో మీరు చేస్తున్న కృషి అమోఘం, ఈ సందర్భంగా మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం కేటీఆర్ సర్" అంటూ పవన్ కల్యాణ్ అభినందనపూర్వకంగా ట్వీట్ చేశారు. 
 
దీనిపై కేటీఆర్ స్పందిస్తూ, తనను అభినందించినందుకు "థ్యాంక్స్ అన్నా!" అంటూ పవన్‌కు వినమ్రంగా బదులిచ్చారు. అయితే సర్ అని సంబోధించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. "సర్ అంటున్నారు, ఇదెప్పటినుంచి? దయచేసి నన్నెప్పుడూ బ్రదర్ అనే పిలవండి" అంటూ ట్వీట్ చేశారు. 
 
దీనికి పవన్ కల్యాణ్ వెంటనే బదులిస్తూ, "అలాగే బ్రదర్" అని పేర్కొన్నారు. ఈ ట్వీట్లు కాసేపట్లోనే ట్విట్టర్‌లో వైరల్ అయ్యాయి. వేల లైకులు, రీట్వీట్లు సొంతం చేసుకున్నాయి. అలా వారిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ సాగిందన్నమాట.