ఎస్.పి. బాలు ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్.. అందులో ఏముందంటే...
లెజండరీ సింగర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఆయన చికిత్స పొందుతున్న ఎంజీఎం హెల్త్‌కేర్ ఆస్పత్రి ఓ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఎస్పీబీ ఆరోగ్యం విషమంగానే ఉన్నట్టు అందులో పేర్కొంది. ఎస్పీ బాలు కరోనాతో తమ ఆసుపత్రిలో చేరారని, ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందని స్పష్టం చేశాయి.
ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, నిపుణులైన వైద్యుల బృందం బాలు గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటోందని, ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని ఆ బులెటిన్‌లో పేర్కొంది. ఈ బులెటిన్‌ను ఆసుపత్రి వైద్య సేవల విభాగం ఏడీ డాక్టర్ అనురాధ భాస్కరన్ విడుదల చేశారు.
మరోవైపు, ఎస్పీబీ తనయుడు ఎస్పీ చరణ్ మాత్రం తన తండ్రి ఆరోగ్యంపై మరోలా స్పందించాడు. తన తండ్రి ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని చెప్పాడు. ఆదివారం ఎలావుందో... సోమవారం కూడా ఆరోగ్యం అలాగే ఉందని, ఆందోళన చెందాల్సిన సమస్యలేవీ రాలేదన్నారు.
తన తండ్రి కోలుకుంటున్న తీరు పట్ల డాక్టర్లు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఆయన త్వరలోనే మామూలు మనిషై అందరి మధ్యకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేవుడు గొప్పవాడు, మీ ప్రార్థనలు గొప్పవి అంటూ తమ శ్రేయోభిలాషులకు, అభిమానులకు చరణ్ కృతజ్ఞతలు తెలిపారు.