శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (16:45 IST)

సుశాంత్ కేసులో అరెస్టుల పర్వం : ఇద్దరిని అరెస్టు చేసిన ఎన్.సి.బి

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు బుధవారం ఇద్దరిని అరెస్టు చేశారు. సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణం ఉందనే అనుమానాలు బలపడిన నేపథ్యంలో... నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. 
 
డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉండవచ్చనే కోణంలో నార్కోటిక్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసినట్టు నార్కోటిక్స్ అధికారి ఒకరు చెప్పారు. అయితే, ఎవరిపై కేసు నమోదు చేశారనే విషయం మాత్రం తెలియరాలేదు.
 
మరోవైపు, సదరు అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం... డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ డీలర్ తో హీరోయిన్ రియా చక్రవర్తి వాట్సాప్ చాటింగ్ ఈ కేసులో కీలక ఆధారంగా ఉంది. డ్రగ్స్ మాఫియాకు బెంగళూరు, గోవా, ఢిల్లీతో సంబంధాలు ఉన్నట్టు సమాచారం.
 
దీనిపై ఎన్‌సీబీ అధికారులు మాట్లాడుతూ, 'అతనికి శామ్యూల్ మిరాండాతో సంబంధం ఉంది. షోవిక్ చక్రవర్తి (రియా చక్రవర్తి సోదరుడు) సూచనల మేరకు మిరాండా డ్రగ్స్ సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి' అని వివరించారు. 
 
కాగా, శామ్యూల్‌ మిరాండా సుశాంత్‌ సింగ్‌ ఇంటిలో హౌస్‌ కీపింగ్‌ మేనేజర్‌గా పని చేసేవాడు. ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలు అతడే చూసుకునేవాడు. గత ఏడాది మేలో రియా అతనిని సుశాంత్‌ ఇంటిలో మేనేజర్‌గా నియమించింది. మొదటి నుంచి సుశాంత్‌ కుటుంబ సభ్యులు అతనిపై ఆరోపణలు చేస్తున్నారు. 
 
సుశాంత్‌ డబ్బును కాజేయడంలో రియాకు అతడు సహాయం అందించడాని వారు ఫిర్యాదు చేశారు. ఇక శామ్యూల్‌తో పాటు ముంబైకు చెందిన జైద్‌ విలాత్రాను కూడా ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. ముంబైలోని  ఉన్నత స్థాయి వర్గాలకు చెందిన వారు జరుపుకునే పార్టీలలో డ్రగ్స్‌ సరఫరా చేసేవాడనే ఆరోపణలు ఉండటంతో జైద్‌ను అదుపులోకి తీసుకున్నారు. 
 
మరోవైపు, సుశాంత్‌ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు రియా చక్రవర్తి తల్లిదండ్రులను బుధవారం విచారించారు. ఈ కేసులో మొదటిసారిగా రియా తల్లిదండ్రులు సీబీఐ ముందు హాజరయ్యారు. ఇక గతవారం రియా తమ్ముడు షోవిక్‌ను కూడా విచారించిన సంగతి తెలిసిందే. 
 
సుశాంత్‌ డబ్బును కాజేసి అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు అంటూ సుశాంత్‌ కుటుంబసభ్యులు రియా కుటుంబ సభ్యులందరిపై కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేశారు. ఇక రియాను సీబీఐ అధికారులు నాలుగు రోజులలో 35 గంటల పాటు విచారించారు.