మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 సెప్టెంబరు 2020 (13:56 IST)

నూతన్‌నాయుడుపై మరో కేసు.. ఉద్యోగం పేరిట కోట్లు మింగేశారట..!

బిగ్ బాస్ రెండో సీజన్ కంటెస్టెంట్ నూతన్‌నాయుడుపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఆయన పై దళిత యువకుడి శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్ నాయుడు, అతని భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఇద్దరిని నమ్మించి మోసం చేసినందుకు మహారాణిపేట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లాకు చెందిన నూకరాజు, తెలంగాణలోని చేవెళ్లకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి మంచి స్నేహితులు. వీరిద్దరు హైదరాబాద్‌లో ఓ బిజినెస్ చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో వీరికి నూతన్‌నాయుడుతో పరిచయం ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న నూతన్‌నాయుడు.. ఎస్‌బీఐలో ఉద్యోగాల ఇప్పిస్తానని చెప్పినట్టు బాధితులు తెలిపారు. 
 
ఇందుకోసం శ్రీకాంత్ రెడ్డి రూ. 12 కోట్లు, నూకరాజు రూ. 5 లక్షలు చెల్లించామని తెలిపారు. అయితే రెండేళ్లు గడిచిన నూతన్‌నాయుడు ఉద్యోగాలు ఇప్పించకపోడంతో తాము మోసపోయామని గ్రహించి వారు పోలీసులకు ఆశ్రయించినట్టు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. 
 
వాస్తవంగా నూతన్‌నాయుడుకు శ్రీకాంత్‌రెడ్డి రూ. 12 కోట్లు ఇచ్చాడా అనే విషయాన్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి నూతన్‌నాయుడుకు సన్నిహితుడిగా ఉన్న శశికాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.