అకీరా.. నా తనయుడు.. మాట్లాడే పద్దతి నేర్చుకోండి : రేణు దేశాయ్
ఓ నెటిజన్‌పై సినీ నటి రేణూ దేశాయ్ మండిపడ్డారు. అకీరా నందన్ తన కుమారుడేనని అని స్పష్టం చేశారు. 'అకీరా నా తనయుడు. మాట్లాడే పద్ధతి నేర్చుకోండి' అంటూ ఆమె తన అసంతృప్తిని బయటపెట్టారు. నెటిజన్ల నుంచి వస్తోన్న కొన్ని ట్వీట్స్ వల్ల తాను బాధపడుతున్నట్లు వెల్లడించారు. పవన్ కల్యాణ్ - రేణూ దేశాయ్‌ల కుమారుడు అకీరా నందన్ పుట్టినరోజు శనివారం జరిగింది. ఈ సందర్భంగా తన కుమారుడికి పుట్టినరోజు విషెస్ చెబుతూ రేణు ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేశారు.
ఓ నెటిజన్ స్పందిస్తూ.. 'మేడమ్.. ఒక్కసారైన మా అకీరాని సరిగ్గా చూపించండి. మా అన్న తనయుడిని చూడాలని మాకెంతో ఆశగా ఉంటుంది' అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌పై అసహనం వ్యక్తం చేసిన రేణు.. 'మీ అన్న తనయుడా..? అకీరా నా అబ్బాయి!! మీరు వీరాభిమానాలు అయ్యి ఉండొచ్చు. కానీ మాట్లాడే పద్ధతి నేర్చుకోండి! ఇలాంటి సందేశాలు, కామెంట్స్‌ను నేను ప్రతిసారీ పట్టించుకోకుండా వదిలేస్తుంటాను. కానీ, మీలాంటి కొంతమంది మరీ కఠినంగా వ్యవహరిస్తున్నారు' అని రిప్లై ఇచ్చారు.
అనంతరం ఆమె.. 'అకీరా బర్త్‌డే రోజు కూడా నా ఇన్‌స్టాలోకి వచ్చి నెగెటివ్ కామెంట్స్ ఎందుకు పెడుతున్నారు? 11 ఏళ్ల నుంచి అర్థం చేసుకుంటున్నాను కానీ, మీరు పెట్టే కామెంట్స్ వల్ల ఈరోజు ఒక తల్లిగా హార్ట్ అవుతున్నాను. మనుషులకు ఏమవుతుందో అస్సలు అర్థం కావడం లేదు. 11 ఏళ్లుగా నన్ను ఒక విలన్‌గా చూస్తున్నారు. నేను పూర్తిగా అలసిపోయాను. ఇప్పటికైనా ఇలాంటి వాటిపై స్పందించకపోతే ఇది నా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించేలా ఉంది' అని ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చారు.
దీనిపై మరో నెటిజన్ స్పందిస్తూ.. 'మేడమ్. తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఎవరి బిడ్డవి అని అడిగితే తండ్రి పేరే చెబుతారు. ఇది మా సంస్కృతి. కాబట్టి కారణం లేకుండా అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేయకండి' అని కామెంట్ చేశాడు. 'మీకు జన్మనిచ్చిన తల్లిని అగౌరవపరచడం మీ సంస్కృతా? భారతీయ సంస్కృతిలో తల్లికి ప్రత్యేక స్థానం ఉంది. ఆమెను దేవుడితో సమానంగా చూస్తారు. కావాలంటే మీ తల్లిని ఓసారి అడిగి తెలుసుకోండి. నా పోస్టులపై తరచూ కామెంట్స్ చేయవద్దని ఫ్యాన్స్‌కు చెప్పండి. కారణం లేకుండా కామెంట్స్ చేస్తున్నారు' అని పేర్కొన్నారు.