తెలుగు మీడియాకు చుక్కలు చూపించిన రాజమౌళి
తెలుగు ప్రజలు సెంటిమెంట్ ఫెలోస్. అందుకే ఆ తరహా సినిమాలు ఎక్కువగా ఆడుతుంటాయనేది విదేశీయులు ఎక్కువగా అంటుంటారు. దర్శకుడు రాజమౌళి అలాంటి ఎమోషన్స్‌తో సినిమాలతో ఆడుకుంటుంటాడు. మీడియాతో కూడా అలానే ఆడుకుంటుంటాడు. గురువారంనాడు అలాంటి సంఘటన జరిగింది. గురువారం పగలు 11 గంటలకు ఆర్.ఆర్.ఆర్. ట్రైలర్ విడుదల చేసి సోషల్ మీడియాలో వదిలాడు. అదే టైంలో ముంబైలో హిందీ వెర్షన్‌ను విడుదల చేయడమేకాకుండా అక్కడ మీడియాతో నటీనటులతో ఇంట్రాక్ట్ అయ్యాడు.
మరి ఇది తెలుగు సినిమానా! హిందీ సినిమానా అనే అనుమానం చాలా మందికి వచ్చింది. గతంలో కూడా బాహుబలికి రాజమౌళి అలానే చేశాడు. ముందుగా హిందీ వారితో ఇంట్రాక్ట్ అయ్యాడు. ఇక తెలుగు మీడియాను ఎటువంటి ప్రచారానికి పిలవకుండా సోషల్ మీడియాతోనే ఆడుకున్నాడు. ఫైనల్‌గా పైరసీ అనేది రావడంతో దాని గురించి చెప్పడానికి అత్యవసరంగా తెలుగు మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు.
ఇక ఈరోజు ఆర్.ఆర్.ఆర్. విషయానికి వస్తే, హిందీ ప్రెస్‌మీట్ తర్వాత తెలుగు మీడియాతో ఇంట్రాక్ట్ అవుతున్నట్లు వెల్లడించారు. రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌లో మీడియా సమావేశం వుంటుందని తెలియజేశారు. అయితే 9గంటల వరకు వస్తారో రారో తెలియక అందరూ గందరగోళ పడ్డారు. మరోవైపు అభిమానులు కూడా బంజారా హిల్స్‌లోని పివిఆర్ థియేటర్‌కు తండోపతండలుగా వచ్చేశారు. కేవలం మీడియాకే అన్నప్పుడు వీరంతా ఎలా వచ్చారనేది సందేహం కూడా కలుగుతుంది.
కానీ నిర్వాహకులు పాస్‌లు ఇచ్చారనీ, కొన్ని అమ్ముకున్నారని విమర్శ నెలకొంది. దాంతో అక్కడ వారిని కంట్రోల్ చేయడం సాధ్యపడలేదు. ఇంచుమించు రాత్రి 9.30 గంటలకు కేవలం రాజమౌళి, నిర్మాత దానయ్య వచ్చి మీడియాకు సీరియస్ క్షమాపణలు అంటూ చెప్పారు.
ఎక్కడో మిస్ కమ్యూనికేషన్ జరిగింది. ప్రెస్ కోసం అని చెప్పాం. కానీ అభిమానులు కూడా వచ్చారు. ఈ టైంలో హీరోలను తీసుకురావడం కష్టం. రెండు రోజుల్లో కేవలం ప్రెస్‌తో మీటింగ్ ఏర్పాటు చేద్దాం అని ముక్తసరిగా మాట్లాడి చేతులు దులుపుకున్నాడు.
అయితే అసలు కారణం వేరుగా వుంది. ఈరోజు రాత్రి బాలయ్యబాబు అఖండ విజయోత్సవ సభ విశాఖటప్నంలో జరుగుతుంది. మీడియా అంతా ఆర్.ఆర్.ఆర్. ప్రెస్‌మీట్ పెడితే అంతా డైవర్షన్ అవుతుందని బాలయ్యబాబుకు కోపం వస్తుందని అందుకే వాయిదా వేశారని టాక్ నెలకొంది. ఎంతో ఆలోచించి సినిమాలు తీసే రాజమౌళి కనీసం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా మీడియాను బలి చేశాడని పలువురు విమర్శిస్తున్నారు.