లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఎవరు అడ్డుకున్నారో తెలుసు : రాంగోపాల్ వర్మ
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఎవరు అడ్డుకున్నారో ప్రతి ఒక్కరికీ తెలుసుని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఆంధ్రప్రదేశ్‌లో తప్ప మిగతా అంతటా విడుదలై మంచి విజయం సాధించింది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సెన్సార్ బోర్డు చిత్ర విడుదలను నిలిపేసిన విషయం తెలిసిందే. అన్ని చిక్కులను దాటి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌లో మే 1వ తేదీన లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలవుతుందని వర్మ తన ట్విట్టరులో పేర్కొన్నాడు.
కానీ, ఇప్పుడు కూడా సినిమా విడుదలకాలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈ చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వొద్దంటూ ఎన్నికల సంఘం అన్ని జిల్లా ఎస్పీ, కలెక్టర్లు ఆదేశాలు జారీచేసింది.
ఈ నేపథ్యంలో గతంలో ఏపీ హైకోర్టు తీర్పుతో పాటు ఈసీ ఇచ్చిన లేఖని జత చేసిన వర్మ న్యాయ పరంగా ఈ విషయంపై పోరాడతానని తన ట్వీట్‌లో తెలిపాడు. పోలింగ్ పూర్తైన తర్వాత సినిమాని విడుదల చేసుకోవచ్చనే ఉత్తర్వులు రావడంతో తమ సినిమా రిలీజ్‌కి ఏర్పాట్లు చేసుకున్నాడు.
కానీ, మళ్ళీ ఈ చిత్ర విడుదలకి అడ్డుపడడంతో ఇలా ఎవరు చేస్తున్నారో, అందరికి తెలుసంటూ వర్మ తన ట్వీట్‌లో ఆవేదన వెళ్ళబుచ్చాడు. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించాడు.