సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (23:08 IST)

ఎల్లలు దాటిన సోనూ సూద్ ఉదార స్వభావం... వలస కార్మికుల కోసం...

అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సోనూ సూద్. ఈయన ఉదారస్వభావం ఇపుడు ఎల్లలుదాటిపోయింది. వలస కార్మికుల కోసం మొన్న పలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఇపుడు ఏకంగా ప్రత్యేక విమానాన్నే నడిపారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వలస కార్మికులు చిక్కుకునిపోయారు. వీరంతా ఉపాధి లేకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి వారిలో చాలా మందిని సోనూ సూద్ తన సొంత ఖర్చులపై ఆయా రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. 
 
ఇపుడు మరోమారు ఉదారస్వాభావాన్ని ప్రదర్శించారు. తాజాగా కేరళలో చిక్కుకుపోయిన 177 మంది మహిళా వలసజీవులను ఒడిశా తరలించేందుకు సోనూ ఈ పర్యాయం వాయు మార్గాన్ని ఎంచుకున్నారు.
 
ఒడిశాకు చెందిన ఆ మహిళలంతా కొచ్చిలోని ఓ ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. అయితే లాక్డౌన్ ప్రకటించడంతో ఉపాధి లేక, తినడానికి ఆహారం దొరక్క తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. 
 
భువనేశ్వర్‌లోని ఓ స్నేహితుడి ద్వారా ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్ వెంటనే చార్టర్డ్ ఫ్లయిట్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు కొచ్చి, భువనేశ్వర్ విమానాశ్రయాలు తెరిచి ఉంచడం కోసం అనుమతులు తీసుకున్నారు.