బుధవారం, 29 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2019 (15:48 IST)

కుక్క తోక వంకర.. నేనూ అంతే

సినీ ఇండస్ట్రీలో సాధారణంగా ఇలాంటి స్టేట్‌మెంట్‌లు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రమే ఇస్తూంటాడు. కానీ ఈసారి టాలీవుడ్ జక్కన్న రాజమౌళి నోటి నుండి ఇలాంటి స్టేట్‌మెంట్ రావడం కాస్త ఆశ్చర్యకరంగానే అనిపిస్తోంది. కానీ, రాజమౌళి తనను తాను కుక్కతోక వంకర అనే సామెతతో పోల్చుకోవడానికి కూడా కారణం ఉంది.
 
'బాహుబలి-2' సినిమా రిలీజైన తర్వాత గ్రాఫిక్స్‌పై మొహం మొత్తేసిన రాజమౌళి, ఇకపై ఏ జానర్‌లో సినిమా చేసినా, తన తదుపరి సినిమాలో గ్రాఫిక్స్ మాత్రం ఉండవని గతంలోనే తేల్చిచెప్పేశాడు. పూర్తిగా యాక్షన్, ఎమోషన్ మీద ఆధారపడే కథ రాసుకుంటానని, గ్రాఫిక్‌జోలికి మాత్రం వెళ్లనని తనకుతానుగా ప్రకటించేశాడు. కానీ రాజమౌళి ఆ మాట మీద నిలబడడం లేదు.
 
రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో మరోసారి పూర్తిస్థాయిలో గ్రాఫిక్స్ ఉంటాయని ప్రకటించాడు మన జక్కన్న. రూ.350 నుంచి రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా 'బాహుబలి' రేంజ్ గ్రాఫిక్స్ ఉంటాయని స్పష్టం చేసేసాడు. ఈ సందర్భంగానే కుక్క తోక వంకర అనే టైపులో గ్రాఫిక్స్ విషయంలో తన బుద్ధి కూడా అంతే అంటూ చమత్కరించాడు.
 
బాహుబలిలో గ్రాఫిక్స్ అన్నీ రిచ్‌గానూ, గ్రాండియర్ లుక్‌లో కనిపిస్తాయనీ.. ఆర్-ఆర్-ఆర్ లో మాత్రం సహజత్వం కోసం గ్రాఫిక్స్ వాడతామని చెప్తున్న రాజమౌళి, కేవలం గ్రాఫిక్స్ కోసమే తమ వర్కింగ్ డేస్ ను కూడా కుదించుకున్నామని చెప్పుకొచ్చాడు.. వచ్చే ఏడాది జనవరి నాటికి గ్రాఫిక్ టీమ్‌కు మెటీరియల్ ఇచ్చేస్తామనీ, అటు తర్వాత నెల రోజులపాటు వాళ్లు గ్రాఫిక్ వర్క్ మీద ఉంటారని తెలిపాడు.
 
మొత్తం మీద ప్రేక్షకులకు ఈ సినిమా కూడా మరో గ్రాఫికల్ వండర్‌గా నిలిచిపోతుందేమో...