శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : శనివారం, 6 ఏప్రియల్ 2019 (13:55 IST)

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. పెద్దలు కుదిర్చిన పెళ్లి.. వేధింపులు బలవన్మరణం

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. అయితే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలనుకుంది. కానీ మామ, భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఆ వేధింపులు ఆగకపోవడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. భర్త మనసు మార్చుకుని తనను కాపురానికి తీసుకెళతాడని ఆశ పెట్టుకుంది. ఇటీవల భర్త పంపిన విడాకుల నోటీసుతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె తొమ్మిది అంతస్తుల పై నుంచి ప్రాణాలు తీసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. నిజాంపేటకు చెందిన చిప్పడ పాండురంగాచార్య తన కుమార్తె మేఘన(30)ను హైదర్‌నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కొత్తపల్లి వినయకుమార్‌కి (32) ఇచ్చి 2017 ఫిబ్రవరిలో వివాహం జరిపించారు. పెళ్లికి ముందే మేఘన టీసీఎస్‌లో ఉద్యోగి. ఆరు నెలల పాటు సజావుగా సాగిన ఈ కాపురంలో వేధింపులు మొదలయ్యాయి. 
 
మామ, భర్త ఆమెను వేధించసాగారు. విడాకులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు. గొడవలతో కలత చెందిన ఆమె సుమారు ఏడాదిన్నరగా తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ క్రమంలో గురువారం వినయకుమార్‌ విడాకుల నోటీసు పంపాడు. ఈ పరిణామంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. 
 
శుక్రవారం ఉదయం ఆఫీస్‌కు వెళ్తున్నట్లు తల్లిదండ్రులతో చెప్పి ఇంటినుంచి బయల్దేరింది. నేరుగా హైదర్‌నగర్‌లో అత్తమామలు, భర్త ఉంటున్న భవ్యాస్‌ అఖిల ఎక్జోటికా అపార్ట్‌మెంట్‌కు చేరుకుని.. నేరుగా తొమ్మిదో అంతస్తులోని టెర్రస్‌పైకి వెళ్లింది. తన హెల్మెట్‌, బ్యాగు అక్కడ పెట్టి కిందికి దూకింది. ఫ్లాట్‌నంబరు 602 వారు ఇంకా మేఘన రాలేదని సెక్యూరిటీకి ఫోన్‌చేయగా అప్పటికే ఆమె పైనుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.