నిన్న పేర్ని నాని ఇంటికి- నేడు పవన్ దగ్గరకు - అసలు జరిగింది ఇదేనా!
Dil raju and team- pawan kalyan
ఆన్ లైన్ సిసిమా టికెట్లను ఎ.పి. ప్రభుత్వం అమ్మడం విషయంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. మంత్రి పేర్ని నాని నుద్దేశించి.. ఎవరో ఆ సన్నాసి.. అంటూ నాలుగైదు సార్లు అన్నాక.. రిపబ్లిక్ ఫంక్షన్‌లో కొందరు పేరు చెప్పగానే. హ..హా.. ఆ సన్నాసే.. అంటూ వ్యాఖ్యానించడం వివాదంగా మారింది. దాంతో ఎ.పి.లోని ఆరుగురు మంత్రులు పవన్ వ్యాఖ్యలను తూర్పూరాపడుతూ ఆయనపై బాణాలు సంధించారు. ఇదంతా జరిగిన తర్వాత సినీప్రముఖుల్లో ముఖ్యుడైన దిల్‌రాజు అతని టీమ్ కలిసి మచిలీపట్నంలోని పేర్నినాని ఇంటికి వెళ్ళి చర్చించారు.
పవన్ కళ్యాణ్‌ది వ్యక్తిగతం. మేమంతా సినీ కుటుంబమే మేం మీకు చెప్పిందానికి (ఆన్‌లైన్‌కు) కట్టుబడి వుంటామని పేర్ని నాని ముందు విన్నవించారు. అసలు అక్కడ ఏఏ సమస్యలు చెప్పారనేది పక్కన పెడితే ఇంటికి వెళ్ళి కలిసి క్షమించమని కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. అసలు పవన్ కళ్యాణే వారందరినీ పంపాడని ఓ టాక్ వుందని శుక్రవారమే చిన్న నిర్మాతల సంఘం అధ్యక్షుడు నట్టికుమార్ మరో బాణం వేశారు. ఏదిఏమైనా పవన్ వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి పోసాని వంటివారు మాట్లాడడం సబబుకాదని కూడా నట్టికుమార్ అన్నారు.
ఇక ఇదిలా వుండగా, శుక్రవారంనాడే అదే దిల్‌రాజు నేతృత్వంలోని సినీ బృందం పవన్ కళ్యాణ్‌ను కలవడం విశేషం. ఈ రోజు ఉదయం ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీ రెడ్డి, సునీల్ నారంగ్, బన్నీ వాసు లు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్రపరిశ్రమకు సంభందించిన సమస్యల గురించి సృహృద్భావ వాతావరణంలో వీరి మధ్య చర్చలు జరిగాయని జనసేన పార్టీ నుంచి ఓ లెటర్ వచ్చింది.
అయితే ఇక్కడ ఏదో జరుగుతుందనేది తెలుస్తోంది. ఒకవైపు పేర్నినాని ఇంటికి పవన్ పంపాడని నట్టికుమార్ అంటుంటే, మచిలీపట్నంలో జరిగిన వివరాలను తెలిపేందుకు దిల్‌రాజు పవన్‌ను కలిశారా అనేది ఆసక్తికరంగా చర్చ సాగుతోంది. మొత్తానికి సినీరంగంలోని సమస్యలు పవన్ మాటల పరిణామాలు చాలా హాట్ టాపిక్‌గా మారాయి.