సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By Selvi
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (14:43 IST)

చెలియా రివ్యూ రిపోర్ట్: మణిరత్నం మార్క్.. కార్తీ, అదితి రావుల రొమాంటిక్ లవ్‌స్టోరీ

ఓకే బంగారం సినిమాకు తర్వాత ప్రముఖ దర్శకుడు, సుహాసిని భర్త మణిరత్నం తెరకెక్కించిన సినిమా చెలియా. ప్రేమకథలకే ప్రాధాన్యమిచ్చే మణిరత్నం.. తన సినిమాల్లో ప్రేమలోని విభిన్న కోణాలను ప్రేక్షకులకు చూపెడుతూనే వు

సినిమా పేరు : చెలియా 
విడుదల తేదీ : ఏప్రిల్ 7, 2017.
తారాగణం : కార్తీ, అదితి రావు హైదరీ, రుక్మిణి విజయ్‌కుమార్, ఢిల్లీ గణేశ్, ఆర్జే బాలాజీ తదితరులు 
దర్శకత్వం: మణిరత్నం 
నిర్మాత: దిల్ రాజు, మణిరత్నం, శిరీష్ 
సంగీతం : ఏఆర్ రెహ్మన్  
 
 
ఓకే బంగారం సినిమాకు తర్వాత ప్రముఖ దర్శకుడు, సుహాసిని భర్త మణిరత్నం తెరకెక్కించిన సినిమా చెలియా. ప్రేమకథలకే ప్రాధాన్యమిచ్చే మణిరత్నం.. తన సినిమాల్లో ప్రేమలోని విభిన్న కోణాలను ప్రేక్షకులకు చూపెడుతూనే వున్నారు. చెలియా కూడా ఇదే తరహా సినిమాల్లో ఒకటి నిలిచిపోయిందని ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చింది. ఊపిరి హీరో కార్తీ.. అందాల తార అదితి రావు హైదరీలను హీరోహీరోయిన్లుగా నటింపజేసి.. చెలియా సినిమాను మణిరత్నం ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం (ఏప్రిల్ 7, 2017) విడుదల అయ్యింది. 
 
గతంలో నాయకుడు, రోజా, బొంబాయి, సఖీ వంటి హిట్ సినిమాలిచ్చిన మణిరత్నంకు ఈ మధ్య బాక్సాఫీసు కలిసిరాలేదు. రావణ్, కడలి వంటి సినిమా ఫట్ కావడంతో మంచి హిట్ కోసం కార్తీతో సినిమా చేశాడు. ఓకే బంగారంకు నార్మల్ మార్కులు పడటంతో.. తాజాగా కార్తీ, అదితి రావు జంటగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన కార్గిల్ వార్ నేపథ్యంలో సాగిన ప్రేమకథను తెరకెక్కించారు. భారత్-పాకిస్థానీయులైన ఓ ఫైటర్ పైలట్, డాక్టర్ మధ్య జరిగిన ప్రేమ కథ రివ్యూ రిపోర్ట్ ఎలా వుందో తెలుసుకుందాం..  
 
కథలోకి వెళ్తే.. 
వీసీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో స్వాడ్రన్ లీడర్‌గా పనిచేసే వరుణ్.. ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడతాడు. వరుణ్‌ను అధికారులు ఆస్పత్రిలో చేర్పిస్తారు. అక్కడ డ్యూటీ డాక్టర్‌ అయిన లీలా అబ్రహం ఆయనకు చికిత్స అందిస్తుంది. ఈ క్రమంలో లీలాను వరుణ్ ఇష్టపడతాడు. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆపై వారి ప్రేమలో కలహాలు చోటుచేసుకోవడంతో వారిద్దరూ విడిపోతారు. ఇక విధుల్లో భాగంగా కార్గిల్‌కు వెళ్తాడు ఫైటర్ పైలట్ వరుణ్. 
 
యుద్ధంలో విమానం కూలి పాకిస్థాన్ సైన్యానికి బందీగా చిక్కుతాడు. రావల్పిండి జైలులో వరుణ్ తన ప్రేమికురాలు లీలా అబ్రహం గురించి తలుచుకొంటూ బతుకుతుంటాడు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వరుణ్ పాక్ జైలు నుంచి ఎలా బయటపడ్డాడు..? తన ప్రేయసిని కలుసుకున్నాడా? లేదా అనేది తెలియాలంటే ఇక సినిమా చూడాల్సిందే. 
 
విశ్లేషణ : ప్రథమార్థం యుద్ధ పోరాటంతో ప్రారంభమవుతుంది. పాకిస్థాన్ అధికారులకు బందీగా దొరికిపోయిన వరుణ్ జైలు జీవితం, ప్రేయసిపై ఊహలతో ఆకట్టుకునే రీతిలో ప్రథమార్థం వుంటుంది. ప్రథమార్థంలో వరుణ్ అన్నయ్య పెళ్లి ఎపిసోడ్ కూడా ఫీల్ గుడ్‌ భావన కలిగిస్తుంది. ఇంటర్వెల్‌కు ముందు పాకిస్థాన్ జైలు నుంచి తప్పించుకోవడంతో సినిమా రెండో భాగంపై ప్రేక్షకుడికి ఆసక్తి పెరుగుతుంది. కానీ రెండో భాగంలో వరుణ్, లీలా ప్రేమ కథను సాగతీయడంతో రెండో భాగంలో క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకుడు భావించేలా వుంటుంది. 
 
సెకండాఫ్‌లో సన్నివేశాలు ఆకట్టుకోలేకపోయాయి. రొటీన్ సన్నివేశాలను తలపించడంతో తేలిపోయింది. ఫలితంగా చెలియా కూడా సాదాసీదా ప్రేమకథగా నిలిచిపోతుందని టాక్ వచ్చింది. మణిరత్నం డైరక్షన్‌ కాస్త గాడి తప్పింది. కథలో దమ్ములో లేదు. కథ స్లోగా సాగడం మైనస్ అయ్యింది. మణిరత్నం స్థాయికి తగ్గట్లు సినిమా లేదని సినీ పండితులు అంటున్నారు. ఎమోషన్స్ మిస్సయ్యాయి.
 
అయితే కార్తీ నటన అదిరింది. పాత్రకు తగినట్టు చక్కగా ఒదిగిపోయాడు. పైలట్‌గా, ప్రేమికుడిగా, యుద్ధ ఖైదీగా తన పాత్రకు వందశాతం న్యాయం చేకూర్చాడు. కీలక సన్నివేశాల్లో మంచి నటనను కనబరిచాడు. రొమాంటిక్ సీన్లలోనూ అదరగొట్టాడు. టోటల్‌గా కార్తీ కెరీర్‌లో చెలియా మంచి సినిమాగా నిలిచిపోతుంది. లీలాగా అదితి రావు కూడా పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అన్నీ కోణాల్లోనూ అదితిరావు నటనతో మెరిసిపోయింది. గ్లామర్ ప్లస్ పాయింట్‌‌గా నిలిచింది. 
 
హైదరాబాదీ అమ్మాయి ప్రధానంగా గద్వాల ప్రాంతానికి చెందిన అదితిరావు కళ్లను చూసి మణిరత్నం ఫిదా అయిపోయాడా అనే భావన కనిపిస్తుంది. ఇప్పటివరకు వెండితెర మీద అదితి ఇంత అందంగా ఉంటుందా అనే భావన చెలియా చిత్రం చూస్తే తప్ప కలుగదు. ఇప్పటివరకు పలు చిత్రాల్లో నటించినా రాని పేరును అదితి ఈ చిత్రంతో సంపాదించుకోవడం ఖాయం. ఇక టెక్నికల్‌గా ఫోటోగ్రఫీ సూపర్ అనిపిస్తుంది. అందమైన లొకేషన్లను.. విభిన్న కోణాలను చూపించడంలో కెమెరా పనితనం బాగుంది.  సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ సక్సెస్ అయ్యారు. చెలియాను ఓ విజువల్ ట్రీట్‌గా మలచడంలో రవివర్మన్ కీలక పాత్రను పోషించాడు. 
 
ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నేపథ్య సంగీతం అదిరిపోయింది. పాటలకు సంగీతం బాగుంది. కానీ రెహ్మాన్ సంగీతం ఒకటి రెండు పాటల్లో ఫీలింగ్ తగ్గించింది. ఈ సినిమాకు కథ స్లోగా నడవడం.. దర్శకత్వం మైనస్ పాయింట్స్. ఏది ఏమైనా మణిరత్నం మార్క్‌ కావడంతో ప్రేక్షకులు బెస్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ అంటూ ముద్ర వేసేశారు. 
 
రేటింగ్ : 3/5.