శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 12 జనవరి 2024 (13:13 IST)

పేరుకే కారం లోపల గుంటూరు యాస, వినోదం, సెంటిమెంట్ - రివ్యూ

Mahesh kaarm
Mahesh kaarm
నటీనటులు: మహేష్ బాబు - రమ్యకృష్ణ - శ్రీలీల - ప్రకాష్ రాజ్ - జయరాం - మీనాక్షి చౌదరి - మురళి శర్మ - జగపతిబాబు - వెన్నెల కిషోర్ - రావు రమేష్ - రఘుబాబు - ఈశ్వరీ రావు - రాహుల్ రవీంద్రన్ 
సాంకేతికత  సంగీతం: తమన్ ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ రచన- దర్శకత్వం: త్రివిక్రమ్ 
 
మహేష్ బాబు,  త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా అనగానే పంచ్ లకు, హాస్యానికి కొదవ వుండదు అనిపిస్తుంది. ఆ తర్వాత గుంటూరు కారం అని పేరు పెట్టాక అభిమానులు కూడా కాస్త కంగారుపడ్డారు. మాస్ సినిమా మహేష్ కు తగినదేనా? అని కూడా వార్తలూ వినిపించాయి. అతడు లో సిస్టర్ సెంటిమెంట్ చూపించి, ఖలేజా లో  మనిషిలో దైవత్వం వున్నాడని చెప్పిన దర్శకుడు ఈసారి ఎటువంటి అంశాన్ని టచ్ చేశాడో తెలుసుకోవాలంటే సినిమాలోకి వెళ్ళాల్సిందే.
 
కథ: 
గుంటూరులో మిర్చి యాడ్ నడిపే జయరాంకు భార్య రమ్యకృష్ణ, కొడుకు రమణ (మహేష్ బాబు) వుంటారు. వారిది  ఉమ్మడి కుటుంబం. రమణ చిన్నతనంలోనే మిర్చియాడ్ లో జరిగిన దుర్ఘటనతో ఎడమకంటిచూపును కొద్దిగా కోల్పోతాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రమ్యకృష్ణ ఆ కుటుంబాన్ని వదిలి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. మరో వివాహం రావురమేష్ ను చేసుకుని తండ్రి ప్రకాష్ రాజ్ తో కలిసి వుంటుంది. 
 
ప్రకాష్ రాజ్ ఓ రాజకీయ పార్టీవల్ల రెండుసార్లు ఎం.ఎల్.ఎ. అవుతాడు. మూడోసారి తన కుమార్తె రమ్యకృష్ణను చేసి మంత్రి పదవికూడా వచ్చేలా చేస్తాడు. అప్పటికి 25 ఏళ్ళు అవుతుంది. ఈ సమయంలో రమణ గుంటూరులోనే తన మిర్చి యార్డ్ వ్యాపారాన్ని చూసుకుంటుంటాడు. గతాన్ని మర్చిపోయిన రమణకు మంత్రి హోదా వున్న రమ్యక్రిష్ణ నుంచి ఫోన్ వస్తుంది. వెళ్ళాక తెలుస్తుంది. రమణకు.. ఆ ఇంటికి ఎటువంటి సంబంధంలేదనీ, ఆస్తిలో కూడా వాటా లేదని సంతకం పెట్టమంటారు. రమణ ససేమిరా అని తిరిగి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఏమయింది? అసలు కన్న తల్లి ఎందుకని కొడుకైన రమణను వదిలేసి వెళ్ళిపోయింది? మధ్యలో శ్రీలీల పాత్ర ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
ఈ సినిమా పాయింట్ కథనం చూస్తుంటే అల్లుఅర్జున్ అలవైకుంఠపురంలో..ఛాయలు కనిపిస్తాయి. పెద్దగా విజయాన్ని చవిచూడలేకపోయినా అతడు, ఖలేజా సినిమా టీవీలో ఎన్నిసార్లు చూసినా మరలా చూడాలనిపిస్తాయి. కానీ గుంటూరు కారంలో కొంచెం లోపం అదే. గుంటూరు కారం అనే సగటు కమర్షియల్ సినిమాను అందించారు.
 
మాస్ సినిమా కాబట్టి బీడీ కాలుస్తూ రమణ కనిపిస్తాడు. చిత్రంలో కీలక పాయింట్ సంతకం పెట్టడం. వదిలేసిన తల్లి, ఎందుకు తనను వదిలేసిందో తెలీని తండ్రి జయరామ్, కూతుర్ని తన చట్రంలో బంధించాలనుకునే తండ్రి ప్రకాష్ రాజ్. ఈ ముగ్గురి కథే గుంటూరు కారం. 
 
అయితే, ఇంటర్ వెల్ వరకు కథలో పెద్దగా చెప్పుకోవడానికి ఏముండదు. తన తల్లి  లాగి చెంపదెబ్బ కొడుతుంది. దాంతో డైలమాలో పడి హైదారబాద్ నుంచి గుంటూరు వస్తాడు రమణ. ఆ తర్వాత నాటకీయ పరిణామలవల్ల తిరిగి హైదరాబాద్ వెళ్ళి తన తల్లిన తన వెంట తీసుకువస్తాడు.
 
ఎందుకు కొడుకును వదిలివెళ్ళింది అనే దానికి ప్రధానంగా పరిశీలిస్తే  కాస్ట్ ఫీలింగ్ అని తెలుస్తుంది.  తమ కులం కాని  వాడిని రమ్యక్రిష్ణ పెండ్లిచేసుకోవడంతో తండ్రి సహించలేక విడదీస్తాడు. తన వంశమే పాలన చేయాలని అవసరమైతే కూతురునైనా చంపడానికి సిద్ధపడే అసురుడిగా ప్రకాష్ పాత్ర వుంటుంది.
 
ఈ సినిమా మహేష్ చాలా సరదాగా పంచ్ డైలాగ్ లతో నడపించేశాడు. త్రివిక్రమ్ మార్క్ అడుగడునా కనపిస్తుంది. శ్రీలీల పాత్ర కాస్త ఎంటర్ టైన్ మెంట్. వెన్నెల కిశోర్ పాత్ర సినిమాకు హైలైట్. ఆ పాత్రే కథను బోర్ లేకుండా నడిపిస్తుంది. జయరాం, రఘు బాబు, ఈశ్వరీ రావు తమ తమ పరిధిలో బాగా చేశారు. ప్రకాష్ రాజ్ తాతగా భిన్నమైన గెటప్ లో అలరించాడు.
 
సాంకేతికంగా మనోజ్ పరమహంస కెమెరా పనితనం బాగా సాగింది. విజువల్ గా సినిమా రిచ్ గా కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. థమన్ సంగీతం రణగొణ ధ్వనులు లేకపోయినా గుర్తుపెట్టుకునేలా లేవు. సాహిత్యం కూడా బాగానే వుంది. ఎంతైనా పర్లేదు.. అనే సాంగ్ లో హీరో జీవితాన్ని, కథను చెప్పేశాడు. మిగిలిన రెండు పాటలు పర్వాలేదు. 
 
- అయితే త్రివిక్రమ్ ఇప్పటికే అత్తారింటికి దారేది, అలవైకుంఠపురములో వంటి తన సినిమాలనే అటు ఇటూగా మార్చేసి రెడీమెడ్ వంటకం తయారుచేసినట్లు ప్రేక్షకులకు అర్థమైపోయింది. షూటింగ్ జరుగుతుండగా కొంత గ్యాప్ రాగానే ఆగిపోయిందనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ సినిమా చూశాక.. అది నిజమనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడా కొత్తగా కనెక్ట్ కాని అంశాలు. రొటీన్ ఫార్మెట్ లో వుండడమే. దర్శకుడు రొటీన్ ఫార్మెట్ లో వెళ్ళిపోయాడు. 
 
కొసమెరుపు: ఇందులో ఓ రౌడీ కోసం వచ్చి తెలీయకుండా అతన్ని కొట్టాక.. అతనే అసలు రౌడీ తెలుస్తుంది. అప్పుడు అతను.. ఎందుకిలా చేశావ్.. అంటే.. అతను చెప్పిన కారణం విని.. ఓరీ.. దాసా (రౌడీపేరు) నా చిన్నప్పుడే  ఇలాంటి ట్రిక్ లు విలన్ లు చేసేశారు. అని సెటైరిక్ గా మహేష్ డైలాగ్ కొడతాడు. అది సినిమాకు బాగా సరిపోతుంది.
రేటింగ్: 2.5/5