శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2017 (19:22 IST)

నిజంగా ముగ్గురు ఎన్టీఆర్‌లా... జై లవ కుశ రివ్యూ రిపోర్ట్

'జై లవకుశ' నటీనటులు: ఎన్టీఆర్‌, రాశి ఖన్నా, నివేదా థామస్‌, సాయికుమార్‌, పవిత్ర లోకేష్‌, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్‌, ప్రదీప్‌ రావత్‌, బ్రహ్మాజీ, సత్య తదితరులు; సంగీతం : దేవిశ్రీ ప్రసాద్‌, ఛాయాగ్రహణం :

'జై లవకుశ' నటీనటులు: ఎన్టీఆర్‌, రాశి ఖన్నా, నివేదా థామస్‌, సాయికుమార్‌, పవిత్ర లోకేష్‌, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్‌, ప్రదీప్‌ రావత్‌, బ్రహ్మాజీ, సత్య తదితరులు; సంగీతం : దేవిశ్రీ ప్రసాద్‌, ఛాయాగ్రహణం : ఛోటా కె.నాయుడు, స్క్రీన్‌ ప్లే : కోన వెంకట్‌-చక్రవర్తి; నిర్మాత: నందమూరి కళ్యాణ్‌ రామ్‌; కథ-మాటలు-దర్శకత్వం : కె.ఎస్‌.రవీంద్ర (బాబీ)
 
కథానాయకుడు ఎన్‌టిఆర్‌ పోషించిన లవుడు, కుశుడు పాత్రల కంటే రావణాసురుడిని అభిమానించే 'జై' పాత్రకు ట్రైలర్‌లో విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. అదే అభిమానుల్లోనూ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. టెంపర్‌.. నాన్నకు ప్రేమతో.. జనతా గ్యారేజ్‌ సినిమాల తర్వాత తనకు వచ్చిన మరో మంచి అవకాశంగా ఎన్‌టిఆర్‌ వ్యాఖ్యానించారు. 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' చిత్ర దర్శకుడు బాబీ దర్శకత్వం వహించడంతోపాటు సోదరుడు కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా మారి తీయడం మరింత క్రేజ్‌ తెచ్చిపెట్టింది. భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'జై లవకుశ' ఆ అంచనాల్ని ఏమేరకు అందుకుందో చూద్దాం పదండి.
 
కథ :
అన్నదమ్ములుగా పుట్టిన జై.. లవ.. కుశ.. ముగ్గురిని రామలక్ష్మణ, భరతుల్లా పెరగాలని తల్లి తులసి ఆశపడుతుంది. చనిపోయే ముందు ఆమె కోరిక నెరవేరుస్తానంటూ మేనమామ పోసాని హామీ ఇస్తాడు. అనంతరం లవకుశలతో 'తెనాలి నాటక సమాజం' పేరుతో ఊర్లలో రామాయణగాథను ప్రదర్శిస్తాడు. లవకుశలంటే చాలా గ్రామాల్లో మంచి పేరు వస్తుంది. జైకు మాత్రం నత్తి వుండటంతో చిన్నచూపు చూడ్డంతో అవమానంగా భావిస్తాడు. అది అగ్నిలా లోలోపల దహించివేస్తుంది. ఓసారి నాటకం రసవత్తరంగా సాగుతుండగా హనుమంతుడు లంకా దహనాన్ని జై ఆలోచనతో నిజం చేసేస్తాడు. దాంతో కాలినగాయాలతో ఎవరివారు దూరమైపోతారు. అలా విడిపోయి వేర్వేరు చోట్ల పెరుగుతారు. 
 
లవ బాగా చదువుకుని బ్యాంక్‌ మేనేజర్‌ అయితే.. కుశ దొంగలా మారతాడు. ఓ సందర్భంలో వీళ్లిద్దరూ అనుకోకుండా కలుస్తారు. సమస్యల్లో ఉన్న వీళ్లిద్దరూ వాటిని చక్కదిద్దుకునే ప్రయత్నాల్లో ఉండగా.. లవ ప్రేయసి.. కుశకు సంబంధించిన డబ్బు కనిపించకుండా పోతాయి. దాని వెనుక సూత్రధారి జై అని తెలుస్తుంది. ఇంతకీ జై ఏమయ్యాడు.. ఎక్కడ ఎలా పెరిగాడు.. లవ ప్రేయసిని.. కుశ డబ్బును అతనెందుకు తీసుకెళ్లాడు.. చివరికి ఈ అన్నదమ్ముల కథ ఎక్కడి దాకా వెళ్లింది అన్నది మిగతా కథ.
 
విశ్లేషణ :
మూడు పాత్రలు ఒక్కడే మెప్పించడం చాలా కష్టమైన విషయం. దాన్ని నటుడిగా ఎన్‌టిఆర్‌ పూర్తి న్యాయం చేశాడు. కొన్ని సన్నివేశాల్లో ఎవరు ఏ పాత్రనేది కనిపెట్టడం కష్టమైనా.. ముగ్గురూ కలిసినప్పుడు మరలా రామాయణ నాటకాన్ని ఆడినప్పుడు ఆ తేడా స్పష్టం చూపించారు. నటుడిగా తనేంతో నిరూపించుకునేందుకు ఈ చిత్రం ఎన్‌టిఆర్‌కు దోహదపడింది. కథాపరంగా చూస్తే ఇది తన వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గరగా వుంది. ఇదే విషయాన్ని ఆయనతోనే ప్రస్తావించినప్పుడు... తాము ముగ్గురు సోదరులమనీ, జానకీ రామ్‌ చనిపోయాడనీ.. సినిమాలో పాత్రలు పోషించినప్పుడు తను గుర్తుకువచ్చాడనీ చెప్పడం విశేషం. నిజజీవితంలో చాన్నాళ్ళు ఎన్‌టిఆర్‌ను హరికృష్ణ కుటుంబీకులు దూరంగా వుంచారు. ఆ తర్వాత వారిలో ఏర్పడిన ప్రేమానురాగాల ద్వారానే మరలా కలిశారు. సరిగ్గా ఇటువంటి కథే కావడంతో ఎన్‌టిఆర్‌ బాగా కనెక్ట్ అయినట్లు కన్పించింది.
 
అయితే చిత్ర కథ కొత్తదేమీ కాదు. పాత కథే. ఇలాంటి కథను ఓ మామూలు నటుడితో తీస్తే ప్రేక్షకులు భరించడం కష్టమే అయ్యేదేమో. కానీ 'జై లవకుశ' విషయంలో దర్శకుడు బాబీ చేసిన అత్యంత తెలివైన పనేంటంటే.. తన కథకు ఎన్టీఆర్‌‌ను కథానాయకుడిగా ఎంచుకోవడం. ఒక మంచి నటుడి చేతిలో పడితే.. ఓ మామూలు కథ కూడా మరో స్థాయికి వెళ్తుందనడానికి నిదర్శనంగా నిలుస్తుంది.
 
ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా జై పాత్రను పండించాడు. మొత్తంగా మూడు పాత్రల్లోనూ వైవిధ్యం చూపిస్తూ.. మూడింటినీ పండిస్తూ.. తెరను ఆక్రమించేశాడు. సినిమా చూసి బయటికి వచ్చాక కూడా ఎన్టీఆర్‌ మాత్రమే కనిపిస్తాడు.మొదటి భాగం వరకు లవకుశల పాత్రల పరిచయం సరిపోతుంది. సెకండాఫ్‌ ఆరంభంలో జై పాత్ర వస్తుంది. అంతవరకు సస్పెన్స్‌ క్రియేట్‌ చేసిన దర్శకుడు.. ఆ పాత్ర వచ్చాకే కథలో ఊపు రప్పించాడు. అలాగే ప్రథమార్థంలో లవకుశల పాత్రలతో వినోదం పండించడంలో.. టైంపాస్‌ చేయించడంలో బాబీ ఓకే అనిపించాడు. లవ పాత్ర చుట్టూ నడిచే రొమాంటిక్‌ ట్రాక్‌ కూడా ఫర్వాలేదనిపిస్తుంది. ఐతే ఎంత టైంపాస్‌ వ్యవహారమైనప్పటికీ.. వీటితో ముడిపడ్డ వేరే పాత్రల్ని ఎక్కడికక్కడ బ్రేక్‌ చేసేయడం.. ఒక ప్రయోజనమంటూ లేకుండా.. లాజిక్‌ లేకుండా సన్నివేశాలు సాగిపోవడం నిరాశ పరుస్తుంది. 
 
జై పాత్రను మొదలుపెట్టిన స్థాయిలో ఆ తర్వాత ఆ క్యారెక్టర్ని నడిపించకపోయినప్పటికీ ఆ పాత్ర కనిపించినపుడల్లా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఆసక్తిని నిలబెడుతుంది. ఒకేసారి మూడు పాత్రల్లో కనిపిస్తూ.. వాటిలో వైవిధ్యం చూపిస్తూ.. ఎన్టీఆర్‌ ప్రేక్షకుల్ని ఎంతగా మెప్పిస్తున్నా.. కథనంలో ఏ విశేషం లేకపోవడం.. బలమైన సీన్లు పడకపోవడంతో ఓ దశలో 'జై లవకుశ' ట్రాక్‌ తప్పుతున్న భావన కలిగిస్తుంది. అలాంటి సమయంలో చివరి అరగంటలో అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో వచ్చే ఎమోషనల్‌ సీన్లు మెప్పిస్తాయి. డ్రామా నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కొంచెం రొటీన్‌గా అనిపించినప్పటికీ మెప్పిస్తాయి. ప్రిక్లైమాక్స్‌‌లో వచ్చే మలుపు సినిమాలో చెప్పుకోదగ్గ అతి పెద్ద మెరుపు.
 
పిల్లలుగా వుండగానే వారి మనస్సుల్ని కలుషితం చేస్తే ఎలా ఎదుగుతారనేందుకు ఈ చిత్రం ఉదాహరణ. ఈ పాయింట్‌తో పలు చిత్రాలు వచ్చినా ఒకే వ్యక్తి మూడు పాత్రలు పోషించడం, అన్నదమ్ములపై పగను పెంచుకున్నా.. లోలోపల వున్న సెంటిమెంట్‌తో మంచివాడిగా మారడం కథలోని ఆసక్తికర అంశం. అమ్మ ఇచ్చిన మాట ప్రకారం తమ్ముల్ని కాపాడేందుకు తన ప్రాణాన్ని పణంగా పెట్టడం అనే ముగింపుతో ప్రేక్షకుడు భారంగా బయటకు వస్తాడు. ఇదే మహిళా ప్రేక్షకులకు, అభిమానులకు మరింత దగ్గర చేస్తుంది. ఇక అక్కడక్కడా చిన్నపాటి లోపాలున్నా జై పాత్ర చుట్టూ తిరిగే కథ కనుక కమర్షియల్‌ అంశాలతో దర్శకుడు ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
 
దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం ఓకే. రావణా.. తేలిపోయా పాటలు బావున్నాయి. సాంగ్స్‌ విషయంలో నిరాశపరిచినప్పటికీ నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు దేవి. జై పాత్ర ప్రవేశించిన దగ్గర్నుంచి నేపథ్య సంగీతం మరో స్థాయిలో ఉంటుంది. కోన వెంకట్‌-చక్రవర్తి కలిసి అందించిన స్క్రీన్‌ ప్లే పర్వాలేదనిపిస్తుంది.
 
- పెండ్యాల మురళీ..
రేటింగ్ ‌: 3/5.