బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By
Last Updated : గురువారం, 10 జనవరి 2019 (15:48 IST)

'పేట' మూవీ 'బాషా' స్టైల్లో ఉంది కానీ... మూవీ రివ్యూ

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం 'పేట'. ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 'కబాలి', 'కాలా', '2.0' వంటి చిత్రాలు వచ్చినప్పటికీ అవేవీ రజినీ ఇమేజ్‌కు తగ్గట్టుగా లేవు. ఈ నేపథ్యంలో కార్తీక్ సుబ్బురాజ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'పేట'. ఈ చిత్రం 'నరసింహా', 'బాషా' చిత్రాల స్థాయిలో ఉంటుందని ఈయన ఆది నుంచి చెప్పుకుంటూ వచ్చారు. ఆ ప్రకారంగానే ఈ చిత్రం ఉందా లేదా? అసలు ఈ చిత్ర కథ ఎలా ఉందో ఓసారి పరిశీలిద్ధాం. 
 
కథ : 
కాళీ (రజినీకాంత్) ఓ రాజకీయ నాయకుడి సిఫార్సుతో ఓ హాస్టల్‌ వార్డెన్‌గా చేరతాడు. ఆ తర్వాత హాస్టల్‌లో జరిగే గొడవలను తనదైన స్టైల్‌లో పరిష్కరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ప్రేమ జంటకు తాను ముందుండి వివాహం కూడా జరిపిస్తాడు. అదేసమయంలో కాలేజీ విద్యార్థులను ర్యాగ్ చేస్తున్న మైఖేల్, అతని తండ్రితో వైరం మొదలవుతుంది. కాళీని అంతమొందించాలని ప్రయత్నించిన ఆ గ్యాంగ్ స్కెచ్ వేస్తుంది. 
 
ఇందుకోసం ఈ గ్యాంగ్ ముసుగులో హాస్టల్‌లోకి ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ వచ్చి చేరుతుంది. అప్పుడే తను కాళీ కాదని. అతని అసలు పేరు 'పేట' వీర అని తెలుస్తుంది. పేట వీరకు, ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌కు ఉన్న పాత వైరమేంటి? అక్కడి రాజకీయ నాయకుడు సింగ్ అలియాస్ సింహాచలం పేటను ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అసలు పేట కథ ఏంటి అనేదే వెండితెరపై చూడాల్సిందే. 
 
నిజానికి ఇలాంటి పాత్రలను రక్తికట్టించడంలో రజినీ స్టైల్ వేరు. కానీ, ఈ చిత్రంలో దర్శకుడు మాత్రం రజినీ స్థాయికి తగినట్టుగా నటనను రాబట్టుకోలేక పోయాడనే చెప్పొచ్చు. మూస ధోరణితోనే చిత్ర కథ సాగుతుంది. కానీ, సినిమాలోని తొలి భాగంలో రజనీ నడిచే తీరు, యువకుడిగా ఆయన పలికించిన హావభావాలు, సిమ్రాన్‌తో సాగే లవ్‌ట్రాక్ ఆకట్టుకుంటాయి. 
 
సుధీర్ఘకాలంగా రజినీతో కలిసి నటించాలని ఎదురుచూసిన త్రిషకు ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడం కొంత నిరాశకు గురిచేస్తుంది. సింహాచలం పాత్రలో బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి, జీతూగా విజయ్ సేతుపతి, మాలిక్‌గా శశికుమార్, మేఘా ఆకాష్‌లు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అనురుధ్ అందించిన పాటలు సినిమా కథనానికి స్పీడు బ్రేకర్లుగా మారినా నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకునే స్థాయిలో వుంది. 
 
ఒరిస్సా స్థానిక కళాకారులతో చేయించి బీజియమ్స్ నేపథ్య సంగీతానికి ప్రాణం పోశాయి. రజనీ సినిమాకు ఓ సగటు అభిమాని ఎలాంటి నేపథ్య సంగీతాన్ని కోరుకుంటాడో ఆ స్థాయి సంగీతాన్ని అందించడంలో అనిరుధ్ విజయవంతమయ్యాడు. ఈ చిత్రంలో నిర్మాణపు విలువలు అడుగడుగునా కనిపిస్తాయి. 
 
అయితే, ఈ చిత్రం 'బాషా', 'నరసింహా' చిత్రాల స్థాయిలో ఉంటుందని దర్శకుడు కార్తీక్ సుబ్బురాజ్ ఆరంభంలోనే ప్రకటించారు. ఆ విధంగానే ఈ చిత్రం ఉంటుందని సగటు ప్రేక్షకుడు ఊహించారు. అయితే, తొలి భాగం బాగానే ఉన్నా.. రెండో అర్థభాగం మాత్రం ఆ స్థాయిలో లేదని చెప్పొచ్చు. 
 
తొలి భాగంలో జరిగే హాస్టల్ ఎపిసోడ్ 'నరసింహా', 'బాషా', 'ముత్తు' చిత్రాలను గుర్తు చేస్తుంది. సిమ్రాన్, రజనీల మధ్య వచ్చే సన్నివేశాలు 20 యేళ్ళ క్రితం రజనీని మరోసారి కళ్లముందుంచుతాయి. ప్రథమార్థం మొత్తం రజనీ అభిమానుల్ని మెప్పించే కోణంలో ఆలోచించిన కార్తీక్ సుబ్బరాజు కథను పాత పంథాలోనే నడిపించాడు. దీంతో తొలి భాగం పాస్ మార్కులతో గట్టెక్కేసింది.
 
అయితే ద్వితీయార్థాన్ని మాత్రం అంత ప్రభావవంతంగా రాసుకోలేకపోయాడు. పగా ప్రతీకారాల నేపథ్యంలో సాగే రొటీన్ యాక్షన్ డ్రామాకు రజనీ మేనరిజమ్స్‌ను జోడించి నడిపించాలనుకున్నాడు కానీ ద్వితీయార్థం కథ సీరియస్ టర్న్ తీసుకోవడంతో ఎక్కడా రజనీ మార్కు మెరుపులు కనిపించడానికి ఆస్కారం లేకుండా పోయింది. ద్వితీయార్థం మొత్తాన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, పగ, ప్రతీకారాలతో నింపేయడం 'కబాలి' చిత్రాన్ని గుర్తు చేస్తుంది. మొత్తంమీద పేటలో తన స్టైల్‌ను రజినీకాంత్ పూర్తిగా చూపించలేకపోయాడని చెప్పొచ్చు.