శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: శనివారం, 19 అక్టోబరు 2019 (20:01 IST)

జనసేనానికి సీఎం జగన్ ఫోన్, ఏం జరుగుతోంది?

ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌‌కు ఫోన్ చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమే.. ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా నాలుగు నెలలవుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్సలు చేస్తోంది.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా జగన్ పైన నిప్పులు చెరుగుతున్నారు. కనీస అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఇలాగే ఉంటుందని పదేపదే విమర్సిస్తున్నారు. 
 
ఇలాంటి సందర్భంలో జనసేన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విధానాలపై చర్చించారు. ముఖ్యంగా రాజధాని విషయంలోను, ఇసుక కొరతపై చర్చించుకున్నారు. కృత్రిమ ఇసుక కొరతతో ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు జీవనోపాధి లేకుండా చేసిందని పవన్ కళ్యాణ్‌ అన్నారు. అంతేకాకుండా రాజధాని విషయంలో బొత్స సత్యనారాయణ గందరగోళమైన ప్రకటనలు చేస్తూ ప్రజలను మరింత గందరగోళానికి గురిచేస్తున్నారంటూ గతంలో పవన్ కళ్యాణ్‌ మండిపడ్డారు.
 
తాజాగా జరిగిన పొలిట్ బ్యూరో మీటింగ్‌లోను ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇది కాస్త ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. దీంతో శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి స్వయంగా పవన్ కళ్యాణ్‌‌కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.

కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ప్రజల్లో వ్యతిరేకతా భావం పెరిగే అవకాశం ఉంటుందని.. ఇప్పటికే ఒకవైపు నుంచి టిడిపి చేస్తున్న విమర్శలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి మీరు ప్రభుత్వాన్ని విమర్శలు చేయడం మానుకోవాలని కోరారట. 
 
సిఎం జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్‌ల మధ్య పది నిమిషాల పాటు ఫోన్లో సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకే తాము ఉన్నామని.. స్నేహితుడిగా తాను కొన్ని విషయాలకు మాత్రమే ఏకీభవిస్తానని... అన్నింటికీ నేను ఒప్పుకోనని ఖరాఖండిగా చెప్పేశారట పవన్. సరదాగానే పవన్ కళ్యాన్‌ సిఎంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని జనసేన వర్గాలు అత్యంత గోప్యంగా ఉంచుతున్నాయి.