#Budget2019 : మోడీ ఎన్ని'కలల' బడ్జెట్ : అద్దె ఆదాయంపై...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం 2019-20 సంవత్సరానికిగాను మధ్యంతర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌ను ఎన్నికలల బడ్జెట్‌గా కేంద్ర తాత్కాలిక విత్తమంత్రి పియూష్ గోయల్ ప్రవేశపెట్టారు.
ఈ బడ్జెట్‌లో దేశంలోని సగం మంది ప్రజలకు, ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలకు ఏదో ఒక లాభం కలిగేలా తాయిలాలు ప్రకటించారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, పెన్షనర్లు, యువత, వృద్ధులు... ఇలా ఎవరినీ వదలకుండా, ఏదో ఒక ప్రయోజనం కల్పించేలా ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేశారు.
దేశానికి వెన్నెముకగా ఉన్న రైతాంగాన్ని ఆదుకునేందుకు రైతు సాయం పేరుతో యేడాదికి రూ.6 వేలు అందజేయనున్నారు. తద్వారా 12 కోట్ల మంది రైతులకు లాభం చేకూరనుంది. అలాగే, మహిళలకు 8 కోట్ల ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 8 కోట్ల కుటుంబాలు లాభపడతాయి.
అసంఘటిత కార్మికులకు పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచడంతో సుమారు 10 కోట్ల మంది వరకూ లబ్దిని పొందనున్నారు. మధ్య తరగతి ఉద్యోగుల్లో పన్ను చెల్లిస్తున్న వారికి భారీ ఊరటను ఇస్తూ, పన్ను పరిమితిని రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో మొత్తం మీద 33 కోట్ల మందికి ప్రత్యక్షంగా లబ్ది కలుగనుంది. అంటే, దేశంలోని యువతను మినహాయిస్తే, దేశ జనాభాలో సగం మందికి లబ్ది చేకూరనుంది.
వీరితో పాటు సినిమాల పిచ్చి ఉండేవారికి కూడా ఆయన మేలు చేకూర్చారు. ప్రస్తుతం చెల్లిస్తున్న టికెట్ ధర కాస్తంతైనా తగ్గేలా జీఎస్టీ మినహాయింపును ప్రతిపాదించారు. ఇళ్లు కొనుగోలు చేసేవారికి జీఎస్టీని త్వరలోనే తగ్గిస్తామన్న శుభవార్తను చెప్పారు. రెండు ఇళ్లు ఉన్నవారికి, రెంటల్ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపులు వచ్చాయి. మొత్తంగా ఇది చూస్తే పూర్తి ఎన్నికల బడ్జెట్‌గా ఉంది.