శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2019 (14:25 IST)

అమిత్ షాతో ముక్తసరిగా జగన్ భేటీ.. అపాయింట్మెంట్ రద్దు చేసుకున్న కేంద్ర మంత్రులు

కేంద్రం హోం మంత్రి అమిత్ షా‌తో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అమిత్‌ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఆయన ముక్తసరిగా మాట్లాడి బయటకు వచ్చేశారు. దీంతో జగన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసినట్టు సమాచారం. మరోవైపు, జగన్‌కు ఇచ్చిన అపాయింట్మెంట్‌ను కేంద్ర మంత్రులు రద్దు చేసుకున్నారు. దీంతో జగన్ ఒకింత షాక్‌కు గురయ్యారు. 
 
అమిత్ షా‌తో సమావేశమయ్యేందుకు జగన్ సోమవారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్న విషయం తెల్సిందే. షాతో సమావేశమయ్యేందుకు 24 గంటల పాటు ఢిల్లీలో వేచివున్నారు. ఆ తర్వాత మంగళవారం అమిత్ షా‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షాకు జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 
 
రాష్ట్ర పునర్విభజన చట్టం కింద రావాల్సిన పలు పెండింగ్ అంశాలను గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై కూడా అమిత్ షాతో మాట్లాడినట్టు తెలుస్తోంది. విద్యుత్ సంస్థలతో చేసుకున్న పీపీఏలపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. కాసేపట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌, మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిలతో కలవాల్సి వుంది. కానీ వారిద్దరూ జగన్‌కు కేటాయించిన అపాయింట్మెంట్‌ను రద్దు చేసుకున్నారు. దీంతో జగన్ షాక్‌కు గురై.. ఎంపీ విజయసాయిరెడ్డిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం.