బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 8 జనవరి 2019 (09:16 IST)

ఈబీసీ కోటా బిల్లు : రాజ్యాంగ సవరణలో ఎదురయ్యే చిక్కులు?

దేశంలోని అగ్రవర్ణ పేదలకు కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీసుకున్న నిర్ణయం ఇపుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే, ఇది ఎన్నికల అస్త్రమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రకటన సరే.. అమలు ఎలా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ముఖ్యంగా, ఈ 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరిగా చేయాల్సివుంది. దీనికి అనేక న్యాయపరమైన చిక్కులు ఎదురుకానున్నాయి. అవేంటే తెలుసుకుందాం. 
 
ప్రస్తుతం దేశంలో 49 శాతం మేరకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు మేరకు కులం ఆధారిత రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదు. కానీ, కేంద్రం ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు ప్రకటించింది. అంటే మొత్తం రిజర్వేషన్లు 59 శాతానికి మించుతుంది. ఇది సాకారం కావాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరిగా మారింది. పైగా, అనేక న్యాయపరమైన చిక్కులు అధికమించాల్సివుంది. 
 
కులం ఆధారిత రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు పరిమితి విధించింది. 1992 నాటి ఇందిరా సాహ్నీ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం మధ్య కేసులో కోర్టు తీర్పునిస్తూ, రిజర్వేషన్ సదుపాయం అనేది సమానత్వ భావనను ధ్వంసం చేసేదిగా ఉండరాదు అని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం వెనుకబడిన తరగతులు (బీసీ)లకు 27 శాతం, షెడ్యూల్డు కులాలు, తరగతులకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఓబీసీలు తదితరులకు కలిపి మొత్తంగా 49 శాతం వరకు రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. ఇప్పుడు అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే అది 59 శాతానికి పెరుగుతుంది. ఇది సాకారం కావడానికి ప్రభుత్వం అనేక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. అవి..
 
* రాజ్యాంగం ప్రకారం వార్షిక ఆదాయం లక్ష రూపాయల కన్నా తక్కువ ఉన్న పౌరులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వంటి సామాజిక వర్గాలకు చెందనివారు ఆర్థికంగా వెనుకబడిన తరగతులుగా పరిగణింపబడతారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల గురించి రాజ్యంగంలో ఎటువంటి నిర్వచనం లేదు. ప్రభుత్వం ప్రతిపాదించబోయే బిల్లులో ఇది కీలకం కానుంది. 
 
* పైగా ఈ రిజర్వేషన్లు అమలు చేయాలంటే ప్రభుత్వం తన రాజ్యాంగ సవరణ ప్రతిపాదనకు సర్వే గణాంకాలు జోడించాల్సి ఉంటుంది. 
 
* ఉభయ సభల్లో ఆమోదం పొందినా అది న్యాయపరిశాలకు వెళ్లకుండా ఉండాలంటే బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సివుంటుంది. 
 
* అందుకే న్యాయపరిశీలనకు వెళ్లకుండా రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం ఆర్థిక వెనుకబాటుతనాన్ని ప్రాతిపదికగా ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అయితే, ఈ ఆర్థిక వెనుకుబాటు తనాన్ని ప్రభుత్వం ఎలా వివరిస్తుందో స్పష్టతలేదు. 
 
* ఒకవేళ రాజ్యాంగాన్ని సవరించినా.. అది రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి వ్యతిరేకంగా ఉంటుంది గనుక దానిని కోర్టులో సవాలు చేసే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
 
* ఇప్పటికే కులాల ఆధారిత రిజర్వేషన్లు 49శాతం ఉన్నాయి. దీని జోలికి వెళ్లకుండా 10శాతం రిజర్వేషన్ కల్పించాలంటే మిగిలిన 51 శాతం నుంచి కేటాయించాలి. అప్పుడు బహిరంగ పోటీ 41 శాతానికి తగ్గిపోతుంది. దీన్ని ఓసీలు ఆమోదిస్తారా? ఇది సాధ్యమేనా? ఇలాంటి అనేక న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.