సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (16:07 IST)

విమానంలో ప్రయాణించిన టీచర్‌కు... పైలట్ విద్యార్థి ఏమిచ్చాడో తెలుసా? (video)

మొన్నటికి మొన్న ఓ పైలట్ తన తొలి జర్నీలో తన తల్లిని నమస్కరించి.. తన విధులను నిర్వర్తించాడు. తాజాగా మరో పైలట్ తన ఉపాధ్యాయునికి విమానంలోనే గౌరవాన్నిచ్చాడు. అన్నీ రంగాల్లో రాణిస్తూ.. ఉన్నతస్థాయికి ఎదిగే వారిని చూసి చాలామంది అసూయ పడుతుంటారు. 
 

కానీ.. ఉపాధ్యాయుడు మాత్రమే తన వద్ద చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగినా అసూయ చెందడు. ఇంకా తమ వద్ద విద్యను అభ్యసించిన విద్యార్థులు రాణించాలని ఆశిస్తుంటారు. 
 
అలాంటి ఉపాధ్యాయుడు తన విద్యార్థి పైలట్‌గా మారిన విమానంలో ప్రయాణిస్తే ఇంకేమైనా వుందా..? ఇలాంటి ఘటనే టర్కీలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. టర్కీకి చెందిన ఓ ఉపాధ్యాయుడు విమానంలో ప్రయాణిస్తుండగా, ఆ సమయంలో పైలట్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. ఆ ఉపాధ్యాయుడి గురించి.. ఆయన సేవలను గురించి పైలట్ కొనియాడాడు. 
 
అంతేగాకుండా అలాంటి ఉపాధ్యాయునికి తాను విద్యార్థి అంటూ ప్రకటించాడు. దీంతో షాకైన ఆ టీచర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సంతోషంలో విమాన ఉద్యోగులు ఇచ్చిన పూలకుండీని తీసుకున్నాడు. ఇంతలో పైలట్ విద్యార్థి రానే వచ్చాడు. అతనిని ఉపాధ్యాయుడు ఆలింగనం చేసుకున్నాడు. తాను ఈ స్థాయికి చేరుకునేందుకు తన ఉపాధ్యాయుడే కారణమని పైలట్ చెప్పిన వ్యాఖ్యలు.. ఆ విమానంలో ప్రయాణించిన ప్రయాణీకులను కంట తడిపెట్టించింది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆ దేశ మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచురించింది. వీడియోను కూడా జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చాలామంది ఈ వీడియోను షేర్ చేస్తూ.. తమ ఉపాధ్యాయులకు ఈ వీడియో అంకితమంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.