సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2020 (08:49 IST)

20 యేళ్ళ కరోనా రోగికి ఊపిరితిత్తుల మార్పిడి సక్సెస్

కరోనా వైరస్‌తో బాధపడుతూ వచ్చిన 20 యేళ్ల రోగికి ఊపిరితిత్తులను వైద్యులు విజయవంతగా మార్పిడిచేశారు. భారత సంతతికి చెందిన అంకిత్​ భరత్​ అనే డాక్టర్​ నేతృత్వంలోని బృందం ఈ ఘనత సాధించింది. కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఈ తరహా శస్త్రచికిత్స చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
అమెరికాలోని షికాగోలో జరిగిందీ ఘటన. ఇక్కడి నార్త్‌వెస్టర్న్ మెడిసిన్‌ ఆసుపత్రిలో 20 ఏళ్ల యువతి చేరింది. కరోనా వైరస్ ప్రభావంతో ఆమె రెండు ఊపిరితిత్తులు పాడైన విషయాన్ని గుర్తించిన వైద్యులు వాటిని మార్చాలని నిర్ణయించారు.
 
భారత సంతతి వైద్యుడు, థొరాసిక్ సర్జన్ నిపుణుడైన డాక్టర్ అంకిత్ భరత్ నేతృత్వంలో ఆమెకు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. కరోనా రోగికి అమెరికాలో ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ ఇదే మొదటిది కావడం గమనార్హం. 
 
కరోనా బాధితుల్లో అవయవ మార్పిడి ఆపరేషన్ చాలా సవాళ్లతో కూడుకున్నదని ఈ సందర్భంగా డాక్టర్ అంకిత్ తెలిపారు. తప్పని పరిస్థితుల్లో కోవిడ్ రోగులకు శస్త్రచికిత్స నిర్వహించవచ్చన్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఊపిరితిత్తులు సేకరించారు. 
 
కాగా, ప్రపంచంలో కరోనా మహమ్మారి ప్రారంభమయ్యాక అమెరికాలో ఇలాంటి శస్త్ర చికిత్స నిర్వహించడం ఇదే తొలిసారి అని భావిస్తున్నారు. దీనిపై డాక్టర్ అంకిత్ స్పందిస్తూ, కొవిడ్‌-19 తీవ్రత వల్ల ఆమె ఆరు వారాల పాటు వెంటిలేటర్‌, ఎక్మోపై ఉండాల్సి వచ్చింది. ఈ నెల మొదట్లో చికిత్సకు వీలు కాని స్థాయిలో రోగి ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. 
 
దీంతో ఆమెకు రెండు ఊపిరితిత్తులు మార్చాల్సిన అవసరం ఉందని అంకిత్‌ తెలిపారు. తర్వాత 48 గంటల్లోనే శస్త్రచికిత్సను నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌ కోసం రోగికి కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ రావాల్సి ఉంటుందని.. ఇందుకోసం ఆమెను నిరీక్షణలో ఉంచాల్సి వచ్చిందన్నారు. తన జీవితంలోనే ఇది సంక్లిష్టమైన శస్త్రచికిత్స అని అంకిత్ తెలిపారు. కొవిడ్ రోగికి ప్రపంచంలోనే తొలిసారిగా గత నెల 26న ఆస్ట్రియాలో ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స జరిగింది.