శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 29 అక్టోబరు 2018 (15:25 IST)

కుప్పకూలిన లయన్ ఎయిర్ పైలట్ భారతీయుడే...

ఇండోనేషియా రాజధాని జకర్తా సముద్రతీరంలో సోమవారం ఉదయం లయన్ ఎయిర్‌కు చెందిన విమానమొకటి కుప్పుకూలిపోయింది. ఈ ప్రమాదంలో 188 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పైలట్, కోపైలట్‌తో పాటు ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నారు. అయితే, ఈ విమానాన్ని నడిపింది భారతీయ కెప్టెన్. ఆయన పేరు సునేజా.
 
ఇదే అంశంపై లయన్ ఎయిర్ ఒక ప్రకటన చేసింది. 'ఆరుగురు సిబ్బందితో కలిసి కెప్టెన్ భవ్యే సునేజా, కోపైలట్ హర్వినో విమానాన్ని నడిపారు. 31 ఏళ్ల ఈ కెప్టెన్‌కు 6,000 గంటల పాటు విమానాలను నడిపిన అనుభవం ఉంది. కోపైలట్ 5000 గంటలకు పైగా అనుభవం ఉంది' అని పేర్కొంది. 
 
ఢిల్లీలోని మయూర్ విహార్‌కు చెందిన సునేజా.. మయూర్ విహార్‌ ఫేజ్-1లోని ఆల్కాన్ పబ్లిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశాడు. ఆ తర్వాత బెల్ ఎయిర్ ఇంటర్నేషనల్ నుంచి 2009లో పైలట్ లైసెన్స్ పొందాడు. మార్చి 2011లో లయన్ ఎయిర్‌లో చేరక ముందు ఎమిరేట్స్‌లో శిక్షణ తీసుకున్నాడు. అక్కడ బోయింగ్ 737 నడిపిన అనుభవం కూడా సునేజాకు ఉంది.
 
దీనిపై జకర్తాలోని భారత దౌత్యకార్యాలయం స్పందిస్తూ, జకర్తా తీరంలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. ఈ ప్రమాదంలో జేటీ610 విమానం నడుపుతున్న భారత పైలట్ భవ్యే సునేజా మృతిచెందడం దురదృష్టకరం. సహాయక కేంద్రంతో సంప్రదింపులు జరపడంతో పాటు దౌత్యకార్యాలయం తరపున అన్ని విధాల సహాయం అందిస్తాం' అని తెలిపింది.