ఫ్యాక్షనిస్టుల్లా మోడీ - జగన్ : ఆ ఒక్క పని చేస్తే బాబు గెలుపును దేవుడూ ఆపలేడు...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిలపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. వారిద్దరూ ఫ్యాక్షనిస్టుల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అదేసమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ ఒక్క పని చేస్తే ఆయన గెలుపును ఆ దేవుడు కూడా ఆపలేడని ఆయన జోస్యం చెప్పారు.
ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎలాంటి ప్రజా వ్యతిరేకత లేదన్నారు. అయితే పార్టీ ఎమ్మెల్యేల్లో 35- 40 శాతం మందిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. వారిని మార్చితే మళ్లీ చంద్రబాబు గెలుపును దేవుడు కూడా ఆపలేరని వ్యాఖ్యానించారు.
'నిజం చెప్పాలంటే ప్రజలకు చంద్రబాబుపై వ్యతిరేకత లేదు. మా జాతి చరిత్ర బాగోలేదు. మా జాతి అంటే.. ఎమ్మెల్యేలు.. ఎంపీలం. బాగుండేవాళ్లను తెచ్చిపెట్టుకుంటే బాబే మళ్లీ సీఎం. నేను ఎప్పుడూ ఏ ఎమ్మెల్యే గురించీ అట్లా, ఇట్లా అని ఆయనకు చెప్పలేదు' అని వ్యాఖ్యానించారు.
ఇకపోతే, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, వైసీసీ అధ్యక్షుడు జగన్ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా వ్యక్తిగతంగా గెలుస్తారని.. కానీ వారు నిలబెట్టిన అభ్యర్థులు గెలుస్తారని చెప్పడం అబద్ధమే అవుతుందన్నారు. అదేసమయంలో జగన్, పవన్ భిన్నధ్రువాలని.. కలిసి పని చేయడం కష్టమని జేసీ అభిప్రాయపడ్డారు.