శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శనివారం, 27 అక్టోబరు 2018 (10:56 IST)

శబరిమలపై సుప్రీం సమర్థిస్తారా? సందీపానంద గిరి ఆశ్రమం ధ్వంసం

శబరిమల పవిత్రతను కాపాడుదామంటూ అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ''సేవ్‌ శబరిమల'' పేరుతో వనపర్తిలో భారీ ర్యాలీ నిర్వహించారు. వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలందరూ శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చన్న సుప్రీం తీర్పును ఖండించారు. అనంతరం జేసీ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. 
 
ఇదిలా ఉంటే.. శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి వయసు నిమిత్తం లేకుండా ఏ మహిళైనా వెళ్లవచ్చని ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును సమర్థించినందుకు తిరువనంతపురంలోని భగవద్గీత స్కూల్ డైరెక్టర్ స్వామి సందీపానంద గిరి ఆశ్రమాన్ని ధ్వంసం చేశారు. ఈ తెల్లవారుజామున ఆశ్రమంలోకి జొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడి, ఆశ్రమానికి నిప్పు పెట్టారు. 
 
ఆవరణలో ఉన్న రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనానికి నిప్పంటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆశ్రమాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. కాగా, గతంలోనే సందీపానంద గిరికి పలువురి నుంచి హెచ్చరికలు, బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది.
 
కాగా, ఈ దాడిపై స్పందించిన కేరళ సీఎం పినరయి విజయన్, భౌతిక దాడులతో ఆలోచనలను, సమాజంలో జరిగే మార్పులను మార్చలేమని అన్నారు. చట్టాన్ని చేతుల్లోకే తీసుకునే అధికారాన్ని ఎవరికీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఆశ్రమంపై దాడి చేసిన వారికి శిక్ష తప్పదని చెప్పారు.