శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (18:09 IST)

అనుకున్నదే జరిగింది.. ఆంధ్రాలో రాజకీయ అగ్నిగుండం

అనుకున్నదే జరిగింది. లోక్‌సభ చివరి రోజు కూడా అధికార పార్టీలో కదలిక కనిపించలేదు. అన్నాడీఎంకే సభ్యులకు నచ్చజెప్పాలని, అవిశ్వాస తీర్మానంపై చర్చిద్దామని ప్రభుత్వం భావించలేదు.

అనుకున్నదే జరిగింది. లోక్‌సభ చివరి రోజు కూడా అధికార పార్టీలో కదలిక కనిపించలేదు. అన్నాడీఎంకే సభ్యులకు నచ్చజెప్పాలని, అవిశ్వాస తీర్మానంపై చర్చిద్దామని ప్రభుత్వం భావించలేదు. ఫలితంగా పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ 11.15 గంటల సమయంలో సభను నిరవధికంగా వాయిదావేస్తున్నట్టు ప్రకటించారు. అంతకుముందు 11 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత అన్నాడీఎంకే సభ్యులు వెల్‌లోకి వెళ్లి, తమ కావేరీ నదీ జలాల బోర్డు సంగతేంటని నినాదాలు చేశారు. 
 
తాను ఓ ప్రకటన చేయాలని అనుకుంటున్నానని, సభను కాసేపు శాంతంగా ఉండనివ్వాలని సుమిత్రా మహాజన్ చేసిన విజ్ఞప్తిని సభ్యులంతా మన్నించగా, బడ్జెట్ మలిదశ సమావేశాలపై ఆమె ఓ ప్రకటన చేశారు. సభ నడిచిన రోజులు, సమావేశపు వివరాలు, ఆమోదం పొందిన బిల్లుల గురించి క్లుప్తంగా చెప్పారు. ఆపై వందేమాతరం గీతాన్ని ఆలపిస్తారని చెప్పిన సుమిత్ర, అది ముగియగానే సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు చెప్పి వెళ్లిపోయారు. లోక్‌సభ వాయిదా పడుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు సభలోనే ఉండటం గమనార్హం. 
 
అంతకుముందు, లోక్‌సభలో టీడీపీ ఎంపీలు తమ నిరసనలను ఉద్ధృతం చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు గురించి నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభ వాయిదా పడిన వెంటనే, ప్రధాని మోడీ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. సభ నుంచి అందరూ వెళ్లిపోయినా టీడీపీ ఎంపీలు మాత్రం మోదీ సీటు ఎదుట బైఠాయించి, ఆందోళన చేపట్టారు. 
 
ఇంకోవైపు చెప్పిన విధంగానే వైసీపీ లోక్‌సభ సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను ఆమె ఛాంబర్‌లో కలసి తమ రాజీనామాలను సమర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, రాజీనామాలను ఉపసంహరించుకోవాలని, ఎంపీలుగా కొనసాగుతూనే పోరాటం చేయాలని సూచించారు. దీనికి సమాధానంగా వైసీపీ ఎంపీలు మాట్లాడుతూ, తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, రాష్ట్ర హక్కుల కోసం రాజీనామాలు చేస్తున్నామని చెప్పారు. అనంతరం వారు అక్కడ నుంచి ఏపీ భవన్‌కు బయల్దేరారు. స్పెషల్ స్టేటస్ కోసం ఆమరణదీక్షకు దిగారు.
 
దీక్ష చేపట్టిన ప్రాంగణం వద్ద దివంగత వైయస్ ఫొటోకు నివాళి అర్పించి దీక్షలో కూర్చున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు దీక్ష ప్రారంభమైంది. దీక్షలో కూర్చున్న ఎంపీలకు సంఘీభావం తెలిపేందుకు పలువురు వైసీపీ మద్దతు దారులు అక్కడకు చేరుకున్నారు. వైసీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అనంత వెంకట్రామిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులు ఎంపీలతో పాటు వేదికపై కూర్చున్నారు.
 
పార్లమెంట్ సమావేశాల్లో ఏపీపై చర్చకు కేంద్రం నిరాకరిస్తున్న తీరుకు నిరసనగా అసెంబ్లీ వరకు సైకిల్‌పై వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించి, ఈ మేరకు శుక్రవారం ఉదయం వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి సీఎం చంద్రబాబు సైకిల్‌పై చేరుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైకిళ్లపైనే అసెంబ్లీకి వచ్చారు. మంత్రులు లోకేష్‌, చినరాజప్ప, ప్రత్తిపాటి, దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు, నారాయణ, యనమల, జవహర్‌ తదితరులు సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేంద్రం ఇచ్చి తీరాల్సిందే అని డిమాండ్ చేశారు. తెలుగువారితో పెట్టుకోవద్దని... తమ పొట్టకొట్టదన్నారు. లేదంటే గతంలో కాంగ్రెస్‌కు పట్టినగతే తమకు పడుతుందని ప్రధాని మోడీని సీఎం హెచ్చరించారు. హక్కులు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇది ఆరంభం మాత్రమే అని సీఎం చంద్రబాబు తెలిపారు. 
 
ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం బెంజిసర్కిల్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి అన్యాయం చేశాయంటూ పవన్ పాదయాత్ర చేపట్టారు. బెంజిసర్కిల్ నుంచి రామవరప్పాడు రింగు వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. పవన్ కళ్యాణ్‌తో పాటు సీపీఎం కార్యదర్శి మధు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ జాతీయరహదారులపై నడిచారు. అలాగే, ఆయా జిల్లా కేంద్రాల్లో కూడా జనసేన, లెఫ్ట్ పార్టీల నేతలు పాదయాత్రలు చేపట్టారు.