బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Modified: గురువారం, 13 మే 2021 (13:02 IST)

ఆరోగ్యశ్రీ వుంటే ఆపరేషన్ ఖాయం: కరోనా వైరస్‌ కంటే ప్రమాదకరంగా మెడికల్ మాఫియా

కరోనా వైరస్‌ మహమ్మారిలా మారి ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. ఈ వైరస్‌ను కట్టడి చేయలేక అమెరికా వంటి అగ్రరాజ్యాలు సైతం బెంబేలెత్తాయి. మన దేశంలో కరోనా రెండో అల అలజడి సృష్టిస్తోంది. దీన్ని ఆసరా చేసుకుని ప్రైవేటు ఆస్పత్రులు ప్రజల రక్తం తాగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలోనే... ప్రపంచ వ్యాపితంగా వైద్యంపైన, వైద్య విధానాలపైన విస్తృత చర్చ సాగుతోంది. భారత దేశంలోని వైద్య వ్యవస్థపైనా చర్చ మొదయింది. ఈ నేపథ్యంలో మనదేశంలో ప్రైవేటీకరించబడిన వైద్యరంగం మెడికల్‌ మాఫియా ఎలా మారిందో కళ్లకు కట్టినట్లు వివరించింది ఒకటిన్నర సంవత్సరం క్రితం ప్రచురితమైన ‘వైద్యానికి సుస్తీ’ అనే పుస్తకం. డాక్టర్‌ అరుణ్‌ గాద్రే, డాక్టర్‌ అభయ్‌ శుక్లా ఆంగ్లంలో రాసిన ఈ పుస్తకాన్ని ప్రజాశక్తి బుక్‌హౌస్ తెలుగులో ప్రచురించింది.
 
 ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న 78 మంది వైద్యుల‌ను ఇంటర్వ్యూ చేయడం ద్వారా సమీకరించిన సమాచారంతో ఈ పుస్తకాన్ని రాశారు. ఢిల్లీ, బెంగుళూరు, కోల్‌కతా, పూణే, ముంబయి వంటి నగరాతో పాటు చిన్న పట్టణాల్లోని వైద్యుల ఆంతరంగాన్ని ఆవిష్కరించిన పుస్తకంలో దిగ్భ్రాంతిగొలిపే అంశాలున్నాయి. జబ్బును గుర్తించడానికి నిర్వహించే వైద్య పరీక్షల్లో, రోగం నయం చేయడానికి ఇచ్చే మందుల్లో... వైద్యుల కమీషన్ల కక్కుర్తిని ఈ మొత్తం వ్యవహారం వెనుక దాగిన మందు కంపెనీల దాష్టీకాన్ని బట్టబయలు చేసింది ఈ పుస్తకం.
 
వైద్యానికి సుస్తీ `పుస్తకంలోని కొన్ని వాక్యాలను యథాతథంగా ఇక్కడ రాస్తున్నాను. (వాస్తవంగా ఇవి వైద్యులు చెప్పిన మాటలే). ఇది చదివిన తరువాత ప్రైవేట్‌ వైద్య రంగంలో ఎంతటి దారుణమైన పరిస్థితు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
 
- వైద్యులను కొన్ని ల్యాబ్స్‌కు కమీషన్లు ఇచ్చి వాళ్లకు కావాల్సిన విధంగా రోగుల రిపోర్టు మార్పించుకుంటారు. మొదట మలేరియా ఉందని రిపోర్టు చూపించి చికిత్స మొదలు పెడతారు. కానీ రోగి ఆరోగ్యం మెరుగుపడదు. తరువాత మరొక పరీక్ష చేయించి టైఫాయిడ్‌ ఉందని చికిత్స చేస్తారు. కమీషన్ల కోసం ల్యాబ్స్‌ రిపోర్టు తయారు చేసి ఇస్తున్నాయి.
 
- డెంగ్యూ వ్యాధి ప్రబలిన తరువాత అందరికీ ప్లేట్లెట్స్‌ కౌంట్‌ పదం తెలిసిపోయింది. ఎలాంటి వైరల్‌ జ్వరం వచ్చినా ప్లేట్లెట్స్‌ సంఖ్య పడిపోతుంది. వెయ్యి మందికి ఏ ఒక్కరో ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉండదు. కొన్ని జాగ్రత్తలు, మందుల‌తో తగ్గిపోతుంది. అయినా...ప్లేట్లెట్స్‌ రెండు ల‌క్షలుండాలి... కానీ ల‌క్ష మాత్ర‌మే ఉన్నాయ‌ని భ‌య‌పెట్టి, ఆస్పత్రిలో చేర్చుకుని, రూ.25 వేల నుంచి రూ.40 వేలు బిల్లు వేసి పంపుతున్నారు.
 
- అప్పుడే పుట్టిన శిశువులో కామెర్లు కొద్ది మోతాదులో ఉండటం సాధారణమైన విషయం. ఇటువంటి శిశువుల్లో రక్తంలో బెలిరుబిన్‌ 14 I 16 మిల్లీగ్రాము ఉండొచ్చు. పెద్దవారిలో 1.2 మిల్లీ గ్రాము మించకూడదు. అయితే... ఈ తేడా చెప్పకుండా బిడ్డకు 10 ఎంల్ ఉంటేనే... బిడ్డ తల్లిదండ్రులను భయపెట్టి, ఆ బిడ్డను అత్యవసర విభాగంలో చేర్చుతారు.
 
- క్షయ వ్యాధిని నిర్ధారించడానికి పరీక్ష సరిపోతుంది. కానీ చాలామంది టిబి గోల్డ్‌, టిబి ప్లాటినం పరీక్షలు రాస్తున్నారు. ఎంత ఖరీదైన పరీక్ష రాస్తే అంత ఎక్కువ కమీషన్‌ వస్తుంది. కొన్ని పరీక్షలు చేయకుండానే రిపోర్టు మాత్రం రాసి మోసం చేస్తున్నారు.
 
- 80 శాతానికిపైగా డిప్రెషన్‌ కేసుల్లో రోగులు తలనొప్పితో బాధపడుతారు. వైద్యులకు ఈ విషయం తెలిసినా.... తలనొప్పికి ఎంఆర్‌ఐ, సిటి స్కాన్‌ పరీక్షలు రాస్తున్నారు.
 
- ఒకప్పుడు గర్భసంచి తొలగింపు (హిస్టరెక్టమీ) ఆపరేషన్లతో ఎలా సంపాదించారో ఇప్పుడు సంతాన సాఫల్య చికిత్స పేరుతో అంతకంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు.
 
- ఒక ఆంజియోప్లాస్టీ ఖర్చు రూ.1,50,000కు మించదు.. కొన్ని ఆస్పత్రుల్లో రూ.3,00,000 దాకా వసూలు చేస్తున్నారు.
 
- క్యాన్సర్‌ చివరి దశలో శస్త్రచికిత్స వ‌ల్ల‌ ప్రయోజనం లేదు. ఇది తెలిసి కూడా ఆస్పత్రిలో చేర్చుకుని, ఆపరేషన్లు చేసి డబ్బు గుంజుతారు. రోగికి చివరి దశలోనూ ప్రశాంతంగా చనిపోయే అవకాశం ఇవ్వరు. బంధువుల‌ భోవోద్వేగాలతో ఆడుకుంటారు.
 
- వైద్య విద్యను ముగించుకుని ప్రాక్టీసు ప్రారంభించగానే యువ వైద్యులను మందు కంపెనీలు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటాయి. ఈ కంపెనీలే వైద్యుల‌కు విదేశీ టూర్లు ఏర్పాటు చేస్తాయి. ఇదంతా సెమినార్లు, మెడికల్‌ కాన్ఫరెన్సు పేరుతో జరుగుతాయి. ప్రయాణ ఖర్చు నుంచి హోటల్ అద్దె దాకా మందుల కంపెనీలే భరిస్తాయి.
 
- తమ కంపెనీ తయారు చేసిన మందునే రోగుల‌తో వాడించడం కోసం మందు కంపెనీలు వైద్యుల‌ను విదేశీ పర్యటనతో, బహుమతులతో ప్రలోభపెడతాయి. ఇలాంటివి అంగీకరించడం అనైతికమని ఎవరూ భావించడం లేదు. పైగా అదే గొప్పగా చెప్పుకుంటున్నారు.
 
- వైద్యులు ఎప్పటికప్పుడు తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం కాన్ఫెరెన్సలు ఏర్పాటు చేసుకోవాలి. ఇటువంటి కాన్ఫరెన్స్‌ను ఒకప్పుడు వైద్యులే తలా కొంచెం వేసుకుని ఏర్పాటు చేసుకునేవారు. ఇప్పుడు మందుల‌ కంపెనీలే ఇటువంటి కాన్ఫరెన్స్‌ను స్పాన్సర్‌ చేస్తున్నాయి. అక్కడ వసతి ఏర్పాట్లు, విందు, మందు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు.
 
- వైద్యులు సొంత డబ్బుతో కాన్షరెన్స్‌ను ఏర్పాటు చేసుకోవాల‌నే వారి వాదన వైద్యుల సంఘాల్లో నెగ్గడం లేదు. ఈ అంశంపైన రహస్య ఓటింగ్‌ నిర్వహించిన సందర్భాలున్నాయి. మందు కంపెనీ స్పాన్షర్‌షిప్‌తోనే నిర్విహించాని తీర్మానించిన పరిస్థితున్నాయి.
 
- ఒకసారి మందు కంపెనీల‌ నుంచి బహుమతులు, విదేశీ టూర్లు అంగీకరించాక... వాళ్లు ఏ మందు చెబితే ఆ మందులే రోగులకు రాయాలి. ఆ కంపెనీ రిప్రిజెంటేటివ్స్‌ చెప్పినట్లు ఆడాలి.
 
- మందు కంపెనీలు తమ మందు పరిశోధనల్లో భాగంగా రోగుల‌పై పరీక్షించాలి. అటువంటప్పుడు డాక్టర్లను ఆశ్రయిస్తారు. వైద్యులు... తమ వద్దకు వచ్చే రోగులకు అసలు విషయం చెప్పకుండా పత్రాల‌పై సంతకాలు చేయించుకుని, వారిపై మందు ప్రయోగిస్తారు. ఇటువంటి అనైతిక చర్య ద్వారా డబ్బు సంపాదించే డాక్టర్లూ ఉన్నారు.
 
- హోమియో, ఆయుర్వేద వైద్యులు అల్లోపతి మందు రాయడానికి వీల్లేదు. అయినా మందు కంపెనీలు వాళ్లనూ ప్రలోభపెట్టి ఆలోపతి మందు రాయిస్తున్నారు.
 
- కార్పొరేట్‌ ఆస్పత్రులు వచ్చాక వైద్య సేవల‌ స్వరూపమే మారిపోయింది. ఈ ఆస్పత్రుల పిఆర్‌ఓలు చిన్న ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. రోగుల‌ను తమ ఆస్పత్రికే పంపాలని కోరుతుంటారు. ఇలా పంపినందుకుగాను కమీషన్లు ఇస్తుంటారు. వారి సొంత ప్రాక్టీస్‌ కంటే ఇలా పంపిన రోగులపై వచ్చే కమీషన్లే ఎక్కువగా ఉంటాయి.
 
- కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యుల‌ది మరో రోదన. ఒక డాక్టర్‌ చూసిన పేషంట్ నుంచి ఆస్పత్రి లక్ష రూపాయలు బిల్లు వసూలు చేస్తే... అందులో డాక్టర్‌కి వచ్చేది రూ.5వేలు లోపే.
 
- ప్రభుత్వ సంస్థతో, ప్రైవేట్‌ సంస్థలతో కార్పొరేట్‌ ఆస్పత్రులు ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఉదాహరణకు కంటి పరీక్ష చేసి అద్దాలు ఇచ్చినందుకు రూ.5000 వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇందులో సంబంధిత ప్రభుత్వ అధికారులకూ వాటాలుంటాయి.
 
- కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు... తన వద్దకు వచ్చే రోగుల్లో కనీసం ఇంత శాతం మందిని అడ్మిట్‌ చేయాన్న షరతులున్నాయి. దీంతో అవసరమున్నా లేకున్నా అడ్మిట్‌ చేస్తున్నారు. ఒకవేళ అలా చేయడానికి నిరాకరించే వైద్యులను ఆస్పత్రి నుంచి పంపేస్తారు.
 
- ఆరోగ్యశ్రీ వంటి బీమా కార్డున్న రోగుల విషయంలో మరింత అన్యాయం జరుగుతోంది. మందుతో తగ్గిపోయేదానికి కూడా ఆపరేషన్లు చేసి డబ్బు రాబట్టుకుంటున్నారు.
 
- ట్రస్టు పేరుతో నమోదైన ఆస్పత్రుల్లో 10 శాతం రోగుల‌కు ఉచితంగానూ, 10 శాతం రోగులకు రాయితీతో చికిత్స చేయాలన్నది నిబంధన. దీన్ని పాటిస్తున్న ఆస్పత్రే కనిపించదు.
 
- మాస్టర్‌ చెకప్‌ పేరుతో దోపిడీ జరుగుతోంది. అందులో చేసే చాలా టెస్టులు అసలు అవసరమే ఉండదు. అయినా ప్రజల‌ను ప్రకటనతో ఆకట్టుకుని, స్కీము పెట్టి పరీక్షలు చేస్తున్నారు.
ఇలా ఎన్నో విషయాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. ఇవన్నీ ముందే చెప్పినట్లు వైద్యులు చెప్పిన మాటలే. ఆయా మోసాలకు, మాయల‌కు మంచి ఉదాహరణలు కూడా చెప్పారు వైద్యులు.

ప్రస్తుతం ఉన్న వైద్య విధానాలకు ప్రత్యామ్నాయం ఏమిటి? వైద్యు ఎలావుండాలి, ప్రభుత్వం ఎటువంటి చర్యు తీసుకోవాలి... అనే అంశాలపైనా వైద్యులు సూచనలు చేశారు