శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2020 (20:05 IST)

మోదీ దెబ్బ, అమ్మకానికి టిక్ టాక్, కొంటామంటున్న మైక్రోసాఫ్ట్ సీఈఒ సత్య నాదెళ్ల

భారత్-చైనా ఉద్రిక్తల నేపధ్యంలో ప్రధానమంత్రి మోదీ పలు ఆన్ లైన్ యాప్స్ నిషేధించారు. ఇందులో ప్రధానమైనది టిక్ టాక్. భారతదేశం నిషేధం విధించిన దగ్గర్నుంచి అమెరికాలోనూ ఈ యాప్ నిషేధించాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి. దీనితో ట్రంప్ కూడా ఈ యాప్ నిషేధానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా నిషేధిస్తే అదే బాటలో మరికొన్ని దేశాలు పయనించే అవకాశం వుంది. దీనితో బెంబేలెత్తిపోయిన టిక్ టాక్ యాజమాన్యం బైట్‌డాన్స్ లిమిటెడ్ టిక్ టాక్ అమ్మకానికి పెట్టేసింది. 
 
ఈ నేపథ్యంలో టిక్ టాక్ కొనుగోలుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆసక్తిని కనబరిచింది. సెప్టెంబరు 15 లోగా టిక్ టాక్ యాప్ ను కొనుగోలు చేసేందుకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని మైక్రోసాప్ట్ తెలియజేసింది. ఐతే అంతకంటే ముందు టిక్ టాక్ ను అమెరికాలో కొనసాగించేందుకు ట్రంప్ అంగీకారానికై మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతున్నట్లు భోగట్టా. టిక్ టాక్ వినియోగదారుల డేటా చోరీకి గురైందన్న ఆరోపణల నేపధ్యంలో అవసరమైతే డేటాను పూర్తిగా తొలగించేందుకు సైతం మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనితో ట్రంప్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.
 
యు.ఎస్, కెనడా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లలో టిక్‌టాక్ కార్యకలాపాలను కొనుగోలు చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఆదివారం ధృవీకరించింది. సెప్టెంబర్ 15 లోపు ఈ ఒప్పందాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా ఉందని చెప్పారు. ఇటీవలి కాలంలో యుఎస్-చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలలో టిక్‌టాక్ ఒక ఫ్లాష్ పాయింట్‌గా మారింది. మాతృ సంస్థ బైట్‌డాన్స్ లిమిటెడ్ అమెరికన్ వినియోగదారుల డేటాను తిరిగి తమకు అప్పగించాలని అమెరికా రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
కాగా ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా వినియోగదారులు టిక్ టాక్‌ను డౌన్‌లోడ్ చేశారు. ఇంత పెద్ద మార్కెట్ కలిగిన ఈ యాప్‌ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ముందడుగు వేస్తోంది. టిక్‌టాక్ యాప్‌కి మరింత భద్రత, గోప్యత మరియు డిజిటల్ భద్రతా రక్షణలను జోడిస్తామనీ, అమెరికన్ల యొక్క అన్ని ప్రైవేట్ డేటా తిరిగి యు.ఎస్‌కు బదిలీ చేయబడుతుందని, దేశం వెలుపల ఉన్న సర్వర్‌ల నుండి తొలగించబడుతుందని పేర్కొంది.

కాగా మైక్రోసాఫ్ట్ టిక్ టాక్‌ను కొనుగోలు చేస్తే ఈ యాప్ తిరిగి భారత్ లోనూ పునఃప్రారంభమయ్యే అవకాశం వుంది. ఈ వార్తతో ఇక్కడి టిక్ టాక్ యూజర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.