శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Updated : ఆదివారం, 15 సెప్టెంబరు 2019 (18:21 IST)

యురేనియం తవ్వకాలకు అనుమతివ్వలేదు : మంత్రి కేటీఆర్

యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అనుమతి ఇవ్వలేదు...ఇవ్వబోదని మంత్రి కే.టీ.ఆర్ స్పష్టం చేశారు. ప్రజల్లో నెలకొన్న ఆందోళనను నివృత్తి చేసేందుకే ముఖ్య మంత్రి తరపున తాను ఈ అంశంపై స్పష్టత ఇస్తున్నాన్నన్నారు. 
 
రాష్ట్రంలో యురేనియం నిక్షేపాల వెలికితీతపై ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి కే.టీ.ఆర్ సుదీర్ఘ సమాధానమిచ్చారు. ప్రతిపక్ష నాయకులు కొందరు యురేనియం అన్వేషణపై బాధ్యతా రాహిత్యంగా, నీచంగా మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 
 
అసలు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండానే అనుమతులు రద్దు చేయమని ప్రతిపక్షాలు అనడం అర్థరహితమన్నారు. ప్రజల్లో భయాందోళనలకు సృష్టిస్తున్నారని... సున్నిత అంశాలను రాసేప్పుడు మీడియా సెన్సిబుల్‌గా వ్యవహరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. 
 
2009లో యూరినియం అన్వేషణపై జి.ఓ నంబర్ 127 ఇచ్చింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమని మంత్రి గుర్తు చేశారు. తవ్వకాలు చేస్తోంది... కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి ఏ.ఎం.డి సంస్థ అని ఆయన స్పష్టం చేశారు. 
 
యురేనియంను అణ్వాయుధాలు, అంతరిక్ష పరిశోధనల్లో వాడుతారని, అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మంచి నిర్ణయంతోనే వెలికితీత చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. 2016లో రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డ్ సమావేశంలో కూడా అప్పటి అటవీశాఖ మంత్రి జోగురామన్నా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో యురేనియం తవ్వకాలకు ఎటువంటి అనుమతి లేదని స్పష్టం చేసిందన్నారు. 
 
అయితే, అన్వేషణ మాత్రం షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిందని మంత్రి వివరించారు. కాలినడకన మాత్రమే వెళ్లాలని, చెట్లు కొట్టొద్దని, బోర్లు తవ్వొద్దని...తవ్వినా తిరిగి యధాస్థితికి తీసుకురావాలని స్పష్టం చేశామన్నారు. యురేనియం శుద్దిచేసేవరకు ఎటువంటి రేడియేషన్ వెలువడదని మంత్రి స్పష్టం చేశారు. 
 
యురేనియం వెలికితీతతో కూడా పర్యావరణానికి హాని కలుగుతుందని, నాగార్జున సాగర్, కృష్ణా నది జలాశయాలు కలుషితమవుతాయని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వీలైతే వెలికితీత కూడా నిలిపివేయాలని సభ్యులు నర్సిరెడ్డి, జీవన్ రెడ్డిలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అవసరమైతే మండలిలో, అసెంబ్లీలో యురేనియం తవ్వకాలపై తీర్మాణం చేసి కేంద్రానికి లేఖ రాయాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని కోరారు. సీఎం కేసీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి.. అవసరమైతే తీర్మానం చేసే దిశగా నిర్ణయం తీసుకుంటామని కే.టీ.ఆర్ హామీ ఇచ్చారు.