1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 30 అక్టోబరు 2018 (12:57 IST)

అమ్మ సమాధికి మోకరిల్లి సారీ చెబితే... రెబెల్ ఎమ్మెల్యేలకు పిలుపు

అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఆర్కే నగర్ ఎమ్మెల్యే, అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వైపు ఉన్న 18 మంది అన్నాడీఎంకే అసంతృప్త ఎమ్మెల్యేలపై పడిన అనర్హత వేటును హైకోర్టు కూడా సమర్థించింది. 
 
ఈ నేపథ్యంలో ఈ మాజీ శాసనసభ్యులందరూ మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధివద్ద మోకరిల్లి క్షమాపణ చెబితే వారిని మళ్లీ పార్టీలో చేర్చుకుంటామని అన్నాడీఎంకే ప్రకటించింది. ఈ మేరకు  ఆ పార్టీ పత్రిక నమదు అమ్మాలో మాజీ శాసనసభ్యులంతా మళ్లీ పార్టీలో చేరాలని ఆహ్వానించింది. 
 
అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నాయకుడు దినకరన్‌ మినహా తక్కినవారినందరినీ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమేనని ఆ పార్టీ ప్రకటించిన మరుసటి రోజే మాజీ ఎమ్యెల్యేలను ఆహ్వానిస్తూ ఓ వ్యాసం ఆ పత్రికలో ప్రచురితమవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 
 
మాజీ శాసనసభ్యులు 18 మంది మెరీనాబీచ్‌లోని జయ సమాధివద్ద మోకరిల్లి క్షమాపణలు చెప్పుకుంటే భేషరతుగా వారిని మళ్లీ పార్టీలోకి చేర్చుకుంటామని అందులో పేర్కొంది. దీనిపై అన్నాడీఎంకే వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.