1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ప్రీతి చిచ్చిలి
Last Modified: బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (12:03 IST)

ఒక్క లైక్ ఆమె జీవితాన్ని మార్చేసింది... ఎలాగో తెలుసా?

ఒక్కోసారి అభిమానం ఎంత వెర్రిగా ఉంటుందంటే ఎంతో ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా గుడ్డిగా తీసుకునేలా చేస్తుంది. ఆమె పేరు అల్పిక. మోదీ అంటే చాలా అభిమానం, తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. గుజరాత్‌కు చెందిన జయదవే అనే యువకుడు గతేడాది కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని విమర్శిస్తూ ట్వీట్ చేయగా, దానికి అల్పిక లైక్ ఇచ్చింది.
 
ఇక వీరి మధ్య పరిచయం మొదలై ప్రేమగా మారి చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, డిసెంబర్ 31న ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నారు. మోదీపై అభిమానంతో ఆ యువకుడి గురించి పూర్తిగా తెలుసుకోకుండా పెళ్లికి అంగీకరించింది అల్పిక. ఇక 2019 జనవరిలో వీరు పెళ్లి చేసుకున్నారు.
 
నెల తిరగకుండానే వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. భర్త తనను వేధింపులకు గురి చేస్తున్నట్లు సామాజిక మీడియాలో పంచుకుంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే మోదీని మధ్యలో తీసుకురావడమే. "నరేంద్ర మోదీపై ఉన్న అభిమానంతో ఆన్‌లైన్‌లో పరిచయమైన జయదవేను పెళ్లాడాను. కానీ నా భర్త మానసికంగానూ, శారీరకంగానూ వేధిస్తున్నాడు. అతనికి నా మీద అనుమానం, ఎక్కడికీ వెళ్లనిచ్చేవాడు కాదు. ఎవరో ఒకరిని తోడుగా పెట్టి పంపేవాడు. 
 
ఇక అతని ఇంట్లోవారు కూడా అతనికే మద్దతుగా ఉన్నారు. అందుకే విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ప్రస్తుతం ఇంటి నుండి బయటికి వచ్చేసి తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాను" అని వాపోయింది. ఎంత అభిమానం ఉంటే మాత్రం ఇలాంటి పనులు చేస్తారా అని అవాక్కవుతున్నారు దీని గురించి తెలిసినవారు.