గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By TJ
Last Modified: శుక్రవారం, 25 మే 2018 (17:30 IST)

తెలుగు సినీ పరిశ్రమను రెండుగా చీల్చిన శ్రీరెడ్డి.. ఎలా అంటే?

చిన్నగాలిలా మొదలైన శ్రీరెడ్డి వ్యహారం తెలుగుసినీ పరిశ్రమనే రెండుగా చీల్చేంత స్థాయికి వెళుతోంది. ఇప్పటిదాకా గుంభనంగా ఉన్న పరిశ్రమ రాజకీయాలన్నీ ఒక్కసారిగా బయటకు వస్తున్నాయి. శ్రీరెడ్డిని సమర్థించేవాళ్లు, శ్రీరెడ్డిని వ్యతిరేకించేవాళ్లు…. రెండు గ్రూపులు

చిన్నగాలిలా మొదలైన శ్రీరెడ్డి వ్యహారం తెలుగుసినీ పరిశ్రమనే రెండుగా చీల్చేంత స్థాయికి వెళుతోంది. ఇప్పటిదాకా గుంభనంగా ఉన్న పరిశ్రమ రాజకీయాలన్నీ ఒక్కసారిగా బయటకు వస్తున్నాయి. శ్రీరెడ్డిని సమర్థించేవాళ్లు, శ్రీరెడ్డిని వ్యతిరేకించేవాళ్లు…. రెండు గ్రూపులుగా కనిపిస్తున్నా, వీటి వెనుక సినీ రాజకీయాలు కమ్ముకుంటున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో మహిళా ఆర్టిస్టులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారనే తీవ్రమైన సమస్యను శ్రీరెడ్డి బయటకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఈ వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. తనకు న్యాయం చేయాలంటూ శ్రీరెడ్డి అర్థనగ్న ప్రదర్శనకు దిగారు. దీంతో ఈ వ్యహారంపై దుమారం రేగింది. 
 
ముందుగా శ్రీరెడ్డి మీడియాకు ఎక్కి విమర్శలు చేస్తున్నప్పుడు… ఆమెకు మా సభ్యత్వం ఇవ్వబోమని, ఆమెతో కలిసి ఎవరూ నటించబోరని మా అసోసియేషన్‌ నాయకలు ప్రకటించారు. అర్థనగ్న ప్రదర్శనతో పాటు ఆమె తన వద్దనున్న కొన్ని ఫొటోలను బయటపెట్టారు. దీంతో కదిలిన మా నాయకులు… ఆమెకు మా సభ్యత్వం ఇస్తామని ప్రకటించారు. లైంగిక వేధింపులను విచారించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతో అంతా సద్దుమణుగుతుందని భావించారు. ఈ క్రమంలోనే హీరో రాజశేఖర్‌పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై జీవిత స్పందించి…. శ్రీరెడ్డిని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే పవన్‌ కల్యాణ్‌పైన శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. 
 
లైంగిక వేధింపులు వంటివి ఉంటే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, టివి ఛానళ్లలో కూర్చుంటే సమస్య పరిష్కారం కాదని అన్నారు. తాను ఇంత సీరియస్‌ సమస్య లేవనెత్తుతుంటే ఉచిత సలహా ఇస్తారా అనే భావనకు వచ్చిన శ్రీరెడ్డి…. పవన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన్ను తీవ్రమైన పదజాలంతో దూషించారు. దీంతో పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి…. తమ కుటుంబం జోలికి రావొద్దని హెచ్చరించారు. నాగబాబు ప్రవేశంతో శ్రీరెడ్డిపైన దాడి తీవ్రమయింది. చాలామంది ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడారు.
 
ఇదిలావుండగానే… శ్రీరెడ్డి అలా మాట్లాడటం వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనూహ్యంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరపైకి వచ్చారు. పవన్‌ను దూషించమని రాంగోపాల్‌ వర్మ చెప్పారని శ్రీరెడ్డి తన స్నేహితురాలికి చెప్పిన ఫోన్‌కాల్‌ రికార్డర్‌ బయటకు వచ్చింది. 
 
తనే పవన్‌ను అలా మాట్లాడమని చెప్పానని అంగీకరిస్తూ రాంగోపాల్‌ వర్మ వీడియో విడుదల చేశారు. ఇదిలావుండగా… మంచువిష్ణు మా అసోసియేషన్‌కు ఒక లేఖ రాశారు. మా అసోసియేషన్‌కు సరైన నిబంధనావళి లేదని, చాలామందికి సభ్యత్వం కూడా లేదని, దీన్ని సంస్కరించాలన్న వాదనను తెచ్చారు. నటుడు, తెలుగుదేశం ఎంపి మురళీ మోహన్‌ స్పందిస్తూ తాను మా అధ్యక్షుడినైతే శ్రీరెడ్డికి సభ్యత్వం ఇవ్వనని అన్నారు. శ్రీరెడ్డి ప్రవర్తించిన తీరును తప్బుబట్టారు. ఈ వ్యవహారం క్రమంగా సినీ పరిశ్రమ రెండు గ్రూపులుగా విడిపోయే దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. శ్రీరెడ్డి లేవనెత్తిన వ్యవహారం సినీ ఇండస్ట్రీలో ఇంకెన్ని మలుపులు తీస్తుందో చూడాలి.