1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : ఆదివారం, 20 జనవరి 2019 (15:19 IST)

అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు : వీహెచ్‌పీ

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్టు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రకటించింది. అయితే, మద్దతు ఇవ్వాలంటే ఓ కండిషన్ పెట్టింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసే మేనిఫెస్టోలో రామ మందిర నిర్మాణ అంశాన్ని చేర్చాలని కోరింది. ఇలా చేస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని తెలిపారు. 
 
ఇదే అంశంపై వీహెచ్‌పీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అలోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ మాకు అన్ని దారులు మూసేసింది. కానీ వాళ్లు ఆ దారులు తెరిచి రామ మందిరాన్ని మేనిఫెస్టోలో చేర్చగలిగితే ఆ పార్టీకి మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ప్రకటించారు. 
 
రామ మందిరంపై చట్టం తీసుకురావాలంటూ బీజేపీపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ నెల 31న వీహెచ్‌పీ ధర్మ సన్సద్‌ను నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. 
 
ఒకవేళ పార్లమెంట్‌లో రామ మందిరంపై బిల్లు తీసుకొస్తే మద్దతివ్వాల్సిందిగా అన్ని పార్టీలను కలిసి కోరినట్లు ఆయన తెలిపారు. ఈ అంశంలో రాజకీయ ఏకాభిప్రాయం అవసరమని తాము భావిస్తున్నట్లు అలోక్ చెప్పారు. అన్ని పార్టీల మేనిఫెస్టోల్లోనూ ఈ అంశాన్ని పెట్టాల్సిందిగా కోరుతున్నట్లు వెల్లడించారు.