టీ కప్పులో తుఫానులా చల్లారిన కర్ణాటక రాజకీయం
సంక్రాంతి పండుగకు ముందు ఉవ్వెత్తున ఎగిసిపడిన కర్ణాటక వేడి.. ఇపుడు పూర్తిగా చల్లబడిపోయింది. సంక్రాంతి పండుగ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు తథ్యమంటూ ప్రగల్భాలు పలికిన కమలనాథులు ఇపుడు చడీచప్పుడు లేకుండా మిన్నకుండిపోయారు. పలువురు ఎమ్మెల్యేలను తమ వైపునకు ఆకర్షించుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ కమల్ పూర్తిగా విఫలమైంది.
దీంతో కర్ణాటక రాజకీయం టీ కప్పులో తుఫానులా సద్దుమణిగిపోయింది. ఫలితంగా కర్ణాటకలోని కాంగ్రెస్ - జేడీఎస్ సర్కారుకు ముప్పు తప్పింది. బీజేపీలో చేరేందుకు సిద్ధమైన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తగినంత మద్దతును కూడగట్టలేక దెబ్బతిన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు బుజ్జగించడంతో మూడ్రోజుల నాటకీయ పరిణామాలకు బుధవారం తెరపడింది.
అదేసమయంలో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు వెళ్లినా తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదంటూ ముఖ్యమంత్రి కుమార స్వామి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కూడా తమ సీఎల్పీ సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటుచేయనుంది. మంత్రి పదవి నుంచి ఇటీవల ఉద్వాసనకు గురైన కాంగ్రెస్ నేత రమేశ్ జార్కిహోళి మరో నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి ముంబైలోని ఓ ప్రైవేటు హోటల్‌లో మకాం వేశారు. కేబినెట్‌లో చోటివ్వనందుకు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్.నగేశ్, ఆర్.శంకర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు గవర్నర్ వజూభాయ్ వాలాకు మంగళవారం లేఖ రాశారు.
దీంతో తమ శిబిరంలోకి కనీసం 10 మంది ఎమ్మెల్యేలైనా వస్తే సర్కారును కూలదోయవచ్చని భావించారు. అయితే కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి కె.సి.వేణుగోపాల్, సీనియర్ మంత్రి డి.కె.శివకుమార్ రంగంలోకి దిగి అసంతుష్ట ఎమ్మెల్యేలను బుజ్జగించినట్లు తెలిసింది. ఆపరేషన్ కమల్ విఫలం కావడంతో సంక్రాంతి తర్వాత సర్కారు కూలిపోతుందన్న కథనాలతో నిద్రలేని రాత్రులు గడిపిన ఉభయ పార్టీల నేతలు ఊపిరి పీల్చుకున్నారు. అదేసమయంలో బీజేపీ ఎమ్మెల్యేలకు గాలం వేసే పనిలో ఇపుడు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు నిమగ్నమయ్యారు.