1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2019 (17:44 IST)

బెంగాల్ గవర్నర్‌కు ఘోర అవమానం ..

ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్న తరుణంలో గురువారం అసెంబ్లీకి వచ్చిన గవర్నర్‌ ధన్‌కర్‌కు ప్రొటోకాల్ మర్యాదలు లభించలేదు. గవర్నర్‌కు మాత్రమే ప్రవేశం ఉన్న గేట్ నంబర్ 3కి తాళాలు పెట్టడంతో దన్‌కర్ మీడియా, అధికారులు ప్రవేశించడానికి ఉద్దేశించిన గేట్ నంబర్ 4 నుంచి అసెంబ్లీలోకి ప్రవేశించవలసి వచ్చింది. ఈ సంఘటన దేశ ప్రజాస్వామిక చరిత్రకు మాయని మచ్చని, ఇది సిగ్గుచేటని గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తాను అసెంబ్లీలో సౌకర్యాలను పరిశీలిస్తానని, లైబ్రరీని సందర్శిస్తానని ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ గేట్ నంబర్ 3కి తాళాలు ఎందుకు వేయవలసి వచ్చిందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగా, గవర్నర్ ఆమోదం పొంది రావలసిన బిల్లులు రాకపోవడంతో అసెంబ్లీ స్పీకర్ మంగళవారం సభను అర్థంతరంగా గురువారం వరకు రెండు రోజులు వాయిదా వేశారు. ఈ పరిస్థితులలో గవర్నర్ గురువారం అసెంబ్లీ సందర్శనకు వచ్చారు. బుధవారం కూడా కోల్‌కతా యూనివర్సిటీని సందర్శించిన గవర్నర్ ధన్‌కర్‌కు చేదు అనుభవం ఎదురైంది. 
 
వైస్ ఛాన్సలర్ కార్యాలయ గదికి తాళం వేసి ఉండడంతో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్ పక్క గదిలో కొద్ది నిమిషాలు వేచి ఉండాల్సి వచ్చింది. విసి సోనాలి చక్రవర్తి బంధోపాధ్యాయ ఎంతకీ రాకపోవడం, ఆమె ఫోన్ కూడా స్విచాఫ్‌లో ఉండడంతో ఆయనకు దిక్కుతోచలేదు. యూనివర్సిటీకి చెందిన సీనియర్ అధికారులు సైతం అక్కడ లేకపోవడంతో కొద్ది సేపటి తర్వాత గవర్నర్ వెనుకకు తిరగాల్సి వచ్చింది.