అంటార్కిటికాలో ముగిసిన సుధీర్ఘ చీకటికాలం.. ఉదయించిన సూర్యుడు
అంటార్కిటికాలో సుధీర్ఘ చీకటికాలం ముగిసింది. అంటే శీతాకాలం ముగిసింది. దీంతో సూర్యోదయం కనిపించింది. ఈ సూర్యోదయానికి సంబంధించిన ఫోటోలను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తాజాగా విడుదల చేసింది.
దాదాపు నాలుగు నెలల పాటు ఉన్న శీతాకాల సమయంలో అంటార్కిటికాలో మైనస్ 70 నుంచి 80 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికితోడు సూర్యోదయం అనేది మచ్చుకైనా కనిపించదు. ఇపుడు శీతాకాలం ముగియడంతో నాలుగు నెలల సుధీర్ఘ చీకటి తర్వాత సూర్యుడు ఉదయించాడు.
తాము సూర్యోదయాన్ని చూసినట్టు అక్కడి కాంకోర్డియా పరిశోధనా కేంద్రంలోని 12 మంది సభ్యులు బృందం తెలిపింది. శీతాకాలం తర్వాత అంటార్కిటికాలో తొలి సూర్యోదయం ఫోటోలను వైద్యుడు హన్నెస్ హోగన్స్ తీయగా, ఈఎస్ఏ వాటిని విడుదల చేసింది.
నిజానికి ఈ అంటార్కిటికా ఖండంలో రెండు ఖండాలు మాత్రమే ఉంటాయి. వాటిలో ఒకటి వేసవి, రెండోది శీతాకాలం. ఎపుడూ మైనస్ డిగ్రీలు ఉండే అంటార్కిటికాలో శీతాకాలం ప్రారంభంకాగానే ఉష్ణోగ్రతలు మైనస్ 70 నుంచి 80 డిగ్రీలకు పడిపోతాయి. ఈ కాలంలో సూర్యోదయం అనే మాటే ఉండదు.
ఈ ప్రాంతంలో మే 3వ తేదీన సూర్యాస్తమయం కాగా, ఆగస్టు వరకు నాలుగు నెలల పాటు చిమ్మచీకటి అలముకుంటుంది. ఈ చిమ్మచీకటి కాలాన్ని పరిశోధకులు బంగారు గనిగా అభివర్ణిస్తారు. ఈ కాలంలో వివిధ పరిశోధనలు నిర్వహిస్తారు.
మలమూత్రాలు, రక్త నమూనాల నుంచి డేటా సేకరిస్తారు. మానవ శరీరంపై సాధారణ, పరిమిత, విపరీత వాతావరణాల ప్రభావాలను అధ్యయనం చేస్తారు. ఈ పరిశోధనలు అంతరిక్ష పరిశోధనా కేంద్రంలోకి వెళ్లే వ్యోమగాములకు ఎంతగానే ఉపయోగపుడుతాయి.