కరకరలాడే బీట్‌రూట్ అటుకుల వడియాలు
కావలసిన పదార్థాలుః
అటకులు - నాలుగు కప్పులు,
బీట్‌రూట్ - మూడు కప్పులు, పచ్చిమిరపకాయల పేస్ట్ - రెండు స్పూన్‌లు,
ఉప్పు - తగినంత,
జీలకర్ర - అర స్పూన్,
అల్లం - రెండు స్పూన్‌లు.
తయారు చేయండి ఇలా :
ముందుగా బీట్‌రూట్‌ను తురుముకొని కొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోసి మెత్తగా రుబ్బి దాని రసం తీసుకుని సిద్దంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో బీట్‌రూట్ రసాని తీసుకుని అందులో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు అన్నీకలిపి ముద్దగా చేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పటికే శుభ్రం చేసి ఉంచుకున్న అటుకులను బీట్ రూట్ రసంలో ఓ ఐదు నిమిషాల పాటు నానబెడితే ఆ రంగులో అటుకులు చూడటానికి బాగా ఉంటాయి. ఓ వెడల్పాటి పాలిథీన్ కవర్‌ను తీసుకుని అటుకులను చిన్న చిన్న వడియాల్లాగా పెట్టుకుని ఎండలో ఉంచాలి.
వీటిని మూడు రోజుల పాటు ఎండలో బాగా ఎండిన తర్వాత గాలి దూరని డబ్బాల్లో భద్రపరచాలి. ఆ తర్వాత అప్పుడప్పుడు ఎండలో ఉంచుతూ ఉంటే వడియాలు పాడుకావు. అలాగే ఇలా తయారు చేసిన వడియాలు ఎంతో రుచికరంగా ఉండడమే కాక... శరీరానికి మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.