" నవ్వినా.. ఏడ్చినా.. కన్నీళ్లే వస్తాయి; ఆ కన్నీళ్లెనకాల ఏముందో తెలుసునా..!" అంటూ మనసు పిండేసే విషాద గీతం అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే కోవలో... అంతులేని ఆనందానికి, తీవ్రమైన నొప్పికి పెద్ద తేడా లేదని పెన్సిల్వేనియా పరిశోధకుల తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.బాధ, సంతోషం, విచారం, ఉక్రోషం, ఆవేశం ఇలా ఏ భావోద్రేకాన్ని తీసుకున్నా వాటికో ప్రత్యేకమైన ముఖకవళికలుంటాయని అందరికీ తెలిసిందే. అయితే సంతోషం, బాధ కలిగే సమయాలలో ముఖకవళికలు (ముఖ్యంగా దాంపత్య జీవితంలో) ఎలా ఉంటాయన్న విషయంపై... అల్బ్రైట్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన అల్బ్రైట్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ సుసాన్ హ్యూజెస్ మాట్లాడుతూ... తమ పరిశోధనల్లో భాగంగా... స్త్రీ పురుషుల కలయిక సందర్భంగా తీసిన, ముఖ్యంగా ముఖకవళిలను ప్రతిబింబించే విధంగా తీసిన 91 మంది జంటల ఫోటోలను ఇంటర్నెట్ ద్వారా అధ్యయనం చేసినట్లు ఆమె తెలిపారు.ఈ అధ్యయనంలో... అంతులేని ఆనందం అనుభవించే భావప్రాప్తి సమయంలోనూ, తీవ్రమైన నొప్పితో బాధపడే సందర్భంలోనూ ముఖంలో ఒకేమాదిరి భావోద్వేగాలు ఉంటున్నట్లు గుర్తించామని సుసాన్ పేర్కొన్నారు. అంతేగాకుండా, ఆడవారి ముఖంలో కనిపించే బాధను మరో మహిళ మాత్రమే చాలా స్పష్టంగా గుర్తించగలుగుతుందని తాము కనుగొన్నట్లు సుసాన్ వెల్లడించారు. ఇకపోతే... మహిళల్లో భావప్రాప్తిని గుర్తించటంలో మాత్రం మగవారిదే అందెవేసిన చెయ్యి అని కూడా ఈ అధ్యయనం ద్వారా వెల్లడైందని ఆమె తెలిపారు. |