రైతు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం మెతకవైఖరిని అవలంభిస్తోందని అందువల్ల మరో గత్యంతరం లేకనే నిరవధిక నిరాహారదీక్షకు దిగినట్టు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ఆయన శుక్రవారం ఉదయం నుంచి సచివాలయంలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద దీక్షలో కూర్చొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవలి కాలంలో వరుసగా సంభవించిన ప్రకృతివైపరీత్యాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వీరికి తగిన న్యాయం చేయాలని తాము ఎంతగానే ప్రభుత్వాన్ని మొత్తుకున్నప్పటికీ లాభంలేకుండా పోయిందన్నారు. అయితే, ప్రభుత్వ వైఖరికీ ఎలాంటి స్పందన లేదన్నారు. అందుకే దీక్షకు దిగాల్సి వచ్చిందన్నారు.
వరుసగా వస్తున్న కష్టాలు, నష్టాలతో రైతులు ఏవిధంగా బతకాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. వారికి ప్రభుత్వమే న్యాయం చేయాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు వరికి ఎకరాకు రూ.10 వేలు, వాణిజ్య పంటలకు రూ.15 వేలు చొప్పున చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతులను ఆదుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామన్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనా విధానాలు, పనితీరులో మార్పు రావాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చంద్రబాబు గుర్తు చేశారు.